
నేషనల్ లెవల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరుగుతూ ఫ్యాన్స్‌కు ఎంజాయ్మెంట్ ఇచ్చే ఆ స్టేడియంలో అదే అభిమానుల రక్తం పారింది. క్రీడాకారులకు ఉత్సాహం నింపుతూ, ఆటను ఆస్వాదించాల్సిన అభిమానులు గుండాల్లా మారారు. పరస్పరం దాడులు చేసుకుని… నలుగురు ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు. హోండురస్ రాజధాని టెగుసిగల్పలోని నేషనల్ స్టేడియంలో మోటాగువా, ఒలింపియా జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. మోటాగువా జట్టు సభ్యులు మైదానానికి బయలుదేరిన సమయంలో… ప్రత్యర్థి జట్టు అభిమానులు వారి బస్సుపై దాడికి దిగారు. రాళ్లు, నీళ్ల సీసాలు విసిరారు. ఈ ఘటనలో కొందరు ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
తమ అభిమాన జట్టుపై దాడి సంగతి తెలియగానే మోటాగువా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒలింపియా జట్టు అభిమానులపై వారు ప్రతిదాడికి దిగారు. మ్యాచ్ నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించినా… ఫ్యాన్స్ అంతా స్టేడియంలోనే ఉండి గొడవపడ్డారు. ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. తుపాకీతో కాల్పులు జరిపారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వీరిని చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో నలుగురు మరణించారు. ఘర్షణల నేపథ్యంలో నేషనల్ స్టేడియాన్ని తాత్కాలికంగా మూసివేశారు.