Kabandha in Ramayana: నేటి మానవుడు జీవితాన్ని ఎలా జీవించాలో తెలిపే కావ్యం రామాయణం. మానవుడు.. తన నడవడికతో దేవుడిగా పూజింపబడతాడు అని చెప్పడానికి సాక్ష్యం.. శ్రీరాముడు.. సుమారు క్రీ. పూ.1500 లో సంస్కృతంలో రచించిన ఈ రామాయణం భారతదేశం లోని అన్ని భాషల్లో అనువదించబడింది. ఇండొనీషియా, థాయిలాండ్, కంబోడియా, మలేషియా, వియత్నాం, లావోస్ దేశాలలో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది. ఇండోనీషియా లోని బాలి దీవిలో రామాయణం నృత్య నాటకం బాగా ప్రసిద్ధి అయితే ఈ రామాయణంలోని అనేక కథలు.. ప్రస్తుతం మనిషి జీవితమార్గాన్ని నిర్దేశిస్తుంది. ఈరోజు కబంధ హస్తం అనే మాటకు రామాయణంలో ఉన్న ప్రాముఖ్యతని తెలిపే ఓ కథ చూద్దాం..
కబంధ హస్తాలు అనే మాటను మనం తరచుగా వింటూనే ఉన్నాం.. ఈ పదం వెనక ఉన్న కథ ఏమిటంటే.. వాల్మీకి రామాయణంలో కబంధుడు అనే పేరుగల ఒక రాక్షసుడు ఉన్నాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం- అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు. భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు. తనని గాయపరిచింది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు.
కబంధుడు వికృత రూపంగా రావడానికి గల కారణం:
కబంధుడు ధనవు అనేవాడి కుమారుడు. బ్రహ్మకోసం తపస్సుచేసి దీర్ఘాయువు పొందాడు. వార గర్వంతో ఉన్న కబంధుడి పై ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసరడంతో అతడి తల కాళ్ళు దేహంలోకి చొచ్చుకుపోయి విచిత్రరూపంలోకి మారిపోయాడు. వధించమని ఎంత ప్రాధేయపడినా బ్రహ్మశాపం వృథా పోకూడదని ఇంద్రుడు కబంధుడిని అలాగే వదిలి వెళ్ళిపోయాడు. ఆ రూపంలో తన వద్దకు వచ్చిన పక్షులను, జంతువులను వధించి ఆహారంగా తింటూ జీవిస్తున్నట్లు తెలిపాడు. రామలక్ష్మణుల కారణంగా కబంధుడు తన శాపం పోగొట్టుకుని యధారూపానికి వచ్చాడు. అనంతరం రాముడికి సీతను వెతకడంలో సుగ్రీవుడు సహాయం చేయగలడని చెప్పి.. సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడో చెప్పాడు.
Also Read: 2వేల కోట్లతో మంత్రాలయంలో అభివృద్ధి పనులు.. గంగా నదిలా తుంగభద్రని శుభ్రం చేస్తామంటూ…