తిరుమల స్వామిపుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయా? ఈ తీర్థం మహిమ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirumala Swami Pushkarini significance Telugu: తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని స్వామిపుష్కరిణికి ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. వైకుంఠం నుంచి గరుడుడు తీసుకొచ్చిన ఈ పవిత్ర తీర్థం ఆవిర్భావం, పురాణ ప్రాశస్త్యం, స్నాన మహిమ, హారతి సంప్రదాయం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

తిరుమల స్వామిపుష్కరిణిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయా? ఈ తీర్థం మహిమ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Tirumala Swami Pushkarini Significance Telugu

Updated on: Nov 13, 2026 | 9:44 PM

Tirumala Swami Pushkarini significance Telugu: దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో తిరుమల క్షేత్రానికి విశిష్టమైన స్థానం ఉంది. ఈ క్షేత్రంలో అరవై ఆరు కోట్ల తీర్థాలు ఉన్నాయని బ్రహ్మపురాణం పేర్కొంటోంది. వీటన్నింటిలోనూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న స్వామిపుష్కరిణి తీర్థం అత్యంత పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం, స్వామిపుష్కరిణి శ్రీ మహావిష్ణువు పాదపద్మాల నుంచి ఆవిర్భవించి, బ్రహ్మదేవుడి స్పర్శతో మరింత పవిత్రతను సంతరించుకుంది. సనక, సనందనాది మహర్షులు ఈ తీర్థాన్ని కొనియాడారు. వైకుంఠం నుంచి గరుడుడు తీసుకొచ్చిన క్రీడాపర్వతంపై శ్రీమహావిష్ణువు, భూదేవి విహరించేందుకు ఈ సరస్సు ఏర్పడినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాల్లోనూ దీని ప్రాశస్త్యం ప్రస్తావించబడింది.

సుమారు ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్వామిపుష్కరిణి మధ్యలో విజయనగర రాజు సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించారు. అనంతరం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ఈ మండప అభివృద్ధికి కృషి చేశారు. 1972లో పుష్కరిణిలో ఫిల్టర్లు, కాలువల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నీటిని ఎప్పటికప్పుడు తొలగించి తాజా నీటితో నింపే ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

స్వామిపుష్కరిణి హారతి ప్రత్యేకత

శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహనసేవల సందర్భంగా పుష్కరిణి వద్ద హారతి ఇస్తారు. సాధారణ రోజుల్లో సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం హారతి నిర్వహిస్తారు. ఈ పూజా సంప్రదాయానికి 12వ శతాబ్దం నాటి శాసనాల్లోనూ ఆధారాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

స్వామిపుష్కరిణి స్నాన మహిమ

స్వామిపుష్కరిణిని సమస్త తీర్థాల సంగమంగా పురాణాలు అభివర్ణించాయి. గంగాది పుణ్యతీర్థాలకు ఇది జన్మస్థానమని, దీన్నే విరజానది అని కూడా పిలుస్తారని చెబుతారు. మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున అరుణోదయ వేళ కోట్లాది తీర్థాలు ఇందులో ప్రవేశిస్తాయని వరాహ, వామన పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల సర్వపాపాలు తొలగి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాముడు వానర సైన్యంతో వేంకటాద్రికి వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసిన అనంతరం రావణుడిపై విజయం సాధించి సీతాదేవిని తిరిగి పొందినట్లు భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది.

అలాగే స్వామిపుష్కరిణిని మూడుసార్లు స్మరిస్తూ ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా విశేష పుణ్యఫలం లభిస్తుందని స్కాందపురాణం తెలియజేస్తోంది. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులు స్వామివారి దర్శనానికి ముందు స్వామిపుష్కరిణిని దర్శించుకోవడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న స్వామిపుష్కరిణి తీర్థ మహిమ, స్నాన ఫలితాలు, పురాణ గాథలు హిందూ పురాణాలు, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలుగా మాత్రమే పరిగణించగలరు.)

Loading...
Unable to load recommendations.
Follow Us