విజయానికి ప్రతీక విజయ దశమి. చెడుపై మంచి సాధించిన చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా దసరా పండుగను ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. విజయ దశమి తమ జీవితాల్లో కొత్త విజయాలను తీసుకురావాలని కోరుకుంటారు. దసరా అనగానే ఠక్కున గుర్తొచ్చేది జమ్మి చెట్టు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పాలపిట్ట దర్శనానికి కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. దసరా రోజు కచ్చితంగా పాలపిట్టను చూడాలని భావిస్తుంటారు. ఇంతకీ పాలపిట్టను చూడాలనే ఆచారం ఎందుకు వచ్చింది.? దీనికి వెనక ఉన్న అసలు కారణమేంటి.? లాంటి విషయాలు మీకోసం..
సాధారణంగా జనావాలసకు దూరంగా చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పాలపిట్టలు కనిపిస్తుంటాయి. అందుకే జమ్మి ఆకుల కోసం వెళ్లిన సమయంలో ఈ పక్షిని చూస్తుంటారు. నీలం, పసుపు రంగులో ఉండే ఈ పక్షి రూపం కూడా ఎంతో బాగుంటుంది. పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తుంటారు. అందుకే దసరా రోజు ఈ పక్షిని చూస్తే ఏడాదంతా విజయలు అందుతాయని విశ్వాసం. అంతేకాకుండా పాలపిట్ట దర్శనం వెనక పురాణగాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
త్రేతా యుగంలో రావణాసురడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడు బయలుదేరి వెళ్లే సమయంలో విజయ దశమి రోజునే పాలపిట్ట ఎదురు వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించి.. సీతమ్మను రావణ చెరనుంచి తీసుకువస్తాడు. ఆ తర్వాత ఆయోధ్యకు రాజుగా మారుతాడు. పాలపిట్టను విజయానికి సూచికగా భావించడానికి ఇదొక కారణం.
అలాగే మహాభారతం ఆధారంగా.. పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద ఆయుధాలను దాచుతారు. ఆ ఆయుధాలకు ఇంద్రుడు పాలపిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. అంతేకాకుండా అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరుగు ప్రయాణమైన సమయంలోనూ పాలపిట్ట దర్శనమిస్తుంది. అప్పటి నుంచి పాండవుల కష్టాలు అన్నీ తొలగిపోయి. కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దీంతో పాలపిట్ట విజయానికి ప్రతీకగా భావిస్తూ విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..