హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ఓడిశాలోని పూరి క్షేత్రం. ఇక్కడ కొలువైన జగన్నాథుడి రథ యాత్ర నేడు ప్రారంభం కానుంది. హిందూ క్యాలండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్ల విదియ రోజున జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమై.. ఏకాదశి వరకు కొనసాగుతుంది. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి పుణ్యక్షేత్రానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. పూరి నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది. హిందూ విశ్వాసం ప్రకారం జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రలతో కలిసి నగరంలో విహరిస్తారు. ఈ రథయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద చెక్క రథాన్ని సిద్ధం చేశారు. ఈ రథాన్ని ని లాగడమే కాకుండా.. కనీసం రథం తాళ్లను తాకినా, కదిలించినా కూడా పుణ్యమైన కార్యక్రమంగా భావిస్తారు. ఈ ఈపద్యంలో రథయాత్రకు సంబంధించిన ఆచారాలు, నమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం.
హిందూ మతంలో చాలా పవిత్రమైనది ముఖ్యమైనది జగన్నాథుని రథయాత్ర. ఈ రోజున జగన్నాథుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి నగరాన్ని సందర్శించడానికి బయలుదేరతాడు. సనాతన సంప్రదాయంలో బలభద్ర భగవానుడు ఆది శేషుడు రూపంగానూ, జగన్నాథుడు శ్రీవిష్ణువు రూపంగానూ పరిగణించబడుతుండగా సుభద్ర దేవి శ్రీకృష్ణుని సోదరిగా భావించి పూజిస్తారు.
పూరి నుండి మొదలయ్యే మహా రథయాత్ర గురించి ఒక నమ్మకం కూడా ఉంది. రథ యాత్ర సమయంలో జగన్నాథుడు తన అత్త గుండిచా అమ్మవారి గుడికి 9 రోజుల పాటు వెళతాడని విశ్వాసం ఇలా వెళ్లే సమయంలో ముందు భాగంలో బలరాముడు, మధ్యలో సుభద్ర దేవి, వెనుక శ్రీ కృష్ణుడి రథం బయలుదేరుతుంది. పూరీ రథయాత్రలోని మూడు రథాలు వేర్వేరు ఎత్తులలో ఉండి.. వివిధ రంగుల దుస్తులతో అలంకరించబడి ఉంటాయి.
పూరీలో రథయాత్రతో వినియోగించే మూడు రథాలు వేప చెక్కతో తయారు చేయబడతాయి. దీనిని దారు అని పిలుస్తారు. విశేషమేమిటంటే ఈ రథం తయారీలో గోరును ఉపయోగించరు.
పూరీ రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ రోజు ప్రారంభమై 10 రోజుల పాటు కొనసాగుతుంది. జగన్నాథుని భక్తులు ఈ మొత్తం పండుగను భక్తితో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. యాత్ర పదవ రోజున అంటే భగవంతుడు జగన్నాథుని రథం, బలభద్రుడు , సుభద్ర దేవతలు మరోసారి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ స్నానమాచరించిన తర్వాత ఆలయంలో ప్రతిష్టిస్తారు. ఈ రథయాత్ర లో పాల్గొన్న వారికి 100 యాగాలకు సమానమైన ప్రతిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. రథయాత్రలో పాల్గొన్న వ్యక్తులు మరణానంతరం మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం.
రథ యాత్ర నేపథ్యంలో పూరీ నగరం లక్షలాది మంది భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈ సారి యాత్రకు సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచానా వేసిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను నడుపుతోంది ప్రభుత్వం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).