Medaram Jatara 2022: మొదట కోయ గిరిజనులైన చందా వంశీయుల ద్వారా 1940-50ల మధ్య బయ్యక్క పేటలో ఆరంభమైన సమ్మక్క, సారలమ్మ జాతర ప్రస్తుతం మేడారంలోని జంపన్నవాగు సమీపంలో జరుగుతోంది. ఇప్పుడు ఈ జాతర వివిధ తెగలకు చెందిన గిరిజనుల సంస్కృతికి అద్దం పడుతోంది. ఈ వనదేవతలను మొదట తెలంగాణ ప్రాంత కోయ గిరిజనులు మాత్రమే కొలిచేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలవారు కూడా ఆరాధిస్తున్నారు. మహారాష్ట్ర నుండి గోండులు, మధ్యప్రదేశ్ నుండి కోయలు, బీర్స్, రఫిస్తార్ గోండులు ఒడిషా నుండి సవర గిరిజనులు, ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని ఆదివాసీ తెగల గిరిజనులు జాతరకు వస్తున్నారు. వనదేవతల పూజారులు .. గోత్రాల వారీగా మొత్తం 14 మంది వారసత్వంగా జాతర నిర్వహిస్తున్నారు. మాఘమాసంలో పున్నెమి వస్తుందనగానే ఆదివాసీల సంస్కృతిలో వెన్నెల వెలుగులు తెస్తుందన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల మనసులు భక్తిభావంతో పొంగిపోతాయి.
అయితే సమ్మక్కసారలమ్మల జాతర ఎప్పుడు ప్రారంభమైందనేది ప్రస్తుతం కొనసాగుతున్న చర్చ. . అసలు జాతర ఎప్పుడు మొదలైంది.. ?ఎక్కడ మొదలైంది..? అన్నవి ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు. జాతర మొదలైంది ఐలాపూర్ లో.. అక్కడి నుంచి బయ్యక్కపేట. ఆ తర్వాత మేడారం వచ్చి స్థిరపడింది. 1932కు పూర్వం మేడారంలో ఒక్క సమ్మక్కగద్దె ఉండేది. ఆ తర్వాత కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చి మరో గద్దెను ప్రతిష్టించి పూజించారు. 1974లో పగిడిద్దరాజు, 1988లో గోవిందరాజుల గద్దెలు కూడా రావడంతో జాతరలో నలుగురు దేవతలు పూజలందుకుంటున్నారు.
ఒకప్పుడు తమ కోయగూడెంలో సమ్మక్కను పూజించాలంటే ఈ నాలుగు రోజుల జాతర జరపాలంటే కావలసిన సరంజామా సమకూర్చుకోవడానికి కోయపెద్దలు ఇతర గూడేల్లో జోలెపట్టేది. ఆనాడు సమ్మక్క ఆదివాసీల ఆరాధ్యదైవం. క్రమక్రమేణా ఆదివాసీలు ఎక్కడ ఉన్నా ఈ జాతరకు తరలిరావడం తమ దైవాన్ని కొలిచివెళ్లడం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గిరిజనేతరులు కూడా ఇక్కడేముందో చూద్దామని వచ్చి తమ మొక్కులు తీరితే వచ్చేసారి వస్తామంటూ మొక్కుకుంటున్న జనం చెప్పినట్టుగా మళ్లీ మళ్లీ వస్తున్నారు.. ఆనోటా ఈనోటా ఖండాంతరాలు దాటిన సమ్మక్క జాతర ఖ్యాతి నేడు కోటి మంది భక్తకోటిని జాతర దరిచేరుస్తోంది.
Read Also…