Medaram Jatara 2022: ఒక్కో రోజు.. ఒక్కో ఘట్టం అటవీప్రాంతంలో భక్తుల సంబురం

| Edited By: Balaraju Goud

Feb 15, 2022 | 1:13 PM

Sammakka Saralamma Maha Jatara: మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైనది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగిపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను మొదటి రోజు గద్దె మీద ప్రతిష్టిస్తారు..

Medaram Jatara 2022: ఒక్కో రోజు.. ఒక్కో ఘట్టం   అటవీప్రాంతంలో భక్తుల సంబురం
Sammakkasaralammajatara
Follow us on

Medaram Jatara 2022: మాఘ శుద్ధ పౌర్ణమి వేళలో జరిగే మేడారం జాతర ఎంతో విశిష్టమైనది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మార్మోగిపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను మొదటి రోజు గద్దె మీద ప్రతిష్టిస్తారు.. ఇక రెండో రోజు సమ్మక్క ప్రతిష్ట కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తారు.. అత్యంత రహస్యంగా పూజలు చేశాక.. జై సమ్మక్క జైజై సమ్మక్క అన్న భక్తుల నినాదాల మధ్య ప్రధాన అమ్మవారి ప్రతిష్ట జరుగుతుంది. రెండేళ్లకోసారి సమ్మక్క పండుగ జరుగుతుంటుంది.. జాతర జరిగే సంవత్సరంలో గిరిజనులకు ఏడాది పొడుగునా సమ్మక్క ధ్యాసే ఉంటుంది. సంవత్సరమంతా దేవతను కొలుస్తూ అడవిలో లభ్యమయ్యే వస్తువులను, వారు చేసే పనులను కార్తెల ప్రకారం అత్యంత వైభవంగా పండుగలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. వర్షాకాలం మొదలు విత్తనాలు పెట్టే సమయంలో సూరాల పండుగ చేసుకుంటారు. ఈ పండుగ రోజు ఇప్పపూలను నిండు చెంబులో వేస్తారు. వేట చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం విత్తనాలలో కలిపి పంట వేస్తారు. ఆ తర్వాత మాఘకార్తె పొట్టపండుగ చేసుకుంటారు. కొత్త ధాన్యం తెచ్చి అమ్మవారి ముందు మొక్కుగా సమర్పించి ఆ తర్వాత కులపెద్దలు తింటారు.

అటు తర్వాత ఉత్తర కార్తెలో అమ్మవారికి కోడిపుంజులు సమర్పించుకుంటారు. దేవుని చేసుకుని పెద్దలకు పండుగ చేసుకుంటారు. అటు పిమ్మట చిక్కుడుకాయకోత పండుగ. అడవిలో లభ్యమయ్యే చీపురు, గడ్డి, చిక్కుడుకాయలు అమ్మవారికి నైవేద్యం పెడతారు.. అనంతరం వాటిని గిరిజనులు ఉపయోగించుకుంటారు. అటు నుంచి మండమెలిగే పండుగ.. ఇది జాతర పండుగ. వేట అమ్మవారికి సమర్పించి అందరూ సమ్మక్కను కొలుచుకుంటారు. చివరగా ఇప్పపూవు పండుగ దీనినే కోలుకడితే పండుగ అంటారు. ఇప్పపూవు పుష్పించే సమయంలో ఈ పండుగ చేసి ఆ తర్వాతే ఇప్పపూవు ఏరుతారు. ఆధునిక కాలంలోనూ ఈ ఆచారవ్యవహారాలు ఇంకా కొనసాగుతున్నాయి. సమ్మక్క జాతర ఏడాది పొడుగునా ఈ పండుగలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో ప్రతి ఘట్టానికి ఒక ప్రత్యేక ఉంది. వన దేవతల వారంగా భావించే బుధవారం… మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో జాతరకు శ్రీకారం చుడుతారు. నాలుగు ప్రాంతాల్లోనూ వన దేవత పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో జాతర లాంఛనంగా మొదలవుతుంది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు జరిగే ఈ పూజా కార్యక్రమాలను మండమెలిగె పేరుతో పిలుస్తారు. మండమెలిగె పూర్తయితే జాతర మొదలైనట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈ రోజు నుంచి ఆదివాసీల ఇళ్లకు బంధువులు వస్తారు. జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది.

నాలుగు రోజులు కార్యక్రమాలు…
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారానికి పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు క్రితంసారి కోట్లాది భక్తులు హాజరు అవుతుంటారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. మేడారం జాతరలో ప్రధానంగా నాలుగు రోజులు 4 ఘట్టాలు ఉంటాయి.

ఫిబ్రవరి 16న సారలమ్మ ఆగమనం..
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సా రలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సు మారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.

ఫిబ్రవరి 17న సమ్మక్క ఆగమనం..
జాతరలో ముఖ్యమైన దినం రెండోరోజు. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది.

ఫిబ్రవరి 18న గద్దెలపై తల్లులు..
గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు.

ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం..
నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు.

మండ మెలిగే ప్రక్రియ ఇలా…
ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం బుధవారం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తా రు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

Read Also….

Medaram Jatara History: సమ్మక్క సారలమ్మల జాతర ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలయ్యింది?

Medaram Jatara: మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం – అంతు చిక్కని రహస్యానికి రమణీయ దృశ్యకావ్యం..