ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలు మా పార్టీలోకి వస్తే పదవులు ఇస్తామంటూ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, సోము వీర్రాజులు ఒకరికొకరు ఆఫర్లు ఇచ్చుకుంటున్నారు. ఏపీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆషాఢం తర్వాత ఆ నెంబర్ మారొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలు జీరో.. ఎంపీలు జీరో. ఇలాంటి పరిస్థితుల్లో బుద్దా వెంకన్న, సోము వీర్రాజులు వాళ్ళ పార్టీ పరిస్థితిని మర్చిపోయి.. లాబీల్లో మాట్లాడుకునే మాటలు రాజకీయ వర్గాలకి జోకులుగా మారాయి. బుద్దాను చూసి సోము వీర్రాజు 2024లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. కనుక నువ్వు కాషాయం కండువా వేసుకో.. మంత్రి పదవి ఇస్తాం అంటూ ఆఫర్ చేశారు. అందుకు బుద్దా.. మీరే మాతో కలిసి పోటీ చెయ్యండి.. పవర్లోకి రాగానే కేబినెట్లోకి తీసుకుంటామని బదులిచ్చారట. వీళ్లు ఇద్దరు తమ తమ పార్టీల్లో పెద్ద శక్తిమంతులు కాకపోయినా వీళ్ళ సంభాషణ అందరినీ ఆకర్షించింది. ఆషాఢం తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని కమలనాధులు బల్లగుద్ది చెబుతుండటంతో.. బీజేపీకి టచ్ లో ఉన్నవారిపై టీడీపీ నిఘా పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న కోల్డ్ వార్ భవిష్యత్తులో సీరియస్ వార్ కావడం ఖాయమనే సంకేతాలు సూచిస్తున్నాయి.