నాలుగు దశాబ్ధాల కంచుకోట కూలిపోయింది. ప్రత్యర్థులు బెదిరించినా మౌనంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక జేసీ బ్రదర్స్ తీరు ఇప్పటివరకు ఇలానే ఉంది. కానీ ప్రస్తుతం జేసీ ఫ్యామిలీ దాడి మళ్లీ మొదలైంది. టీడీపీ మొత్తం అయోమయంలో ఉంటే జేసీ బ్రదర్స్ కి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఈ ధైర్యం వెనుక ఎవరున్నారు?
జేసీ బ్రదర్స్.. ఈ పేరు వెనుక 45 సంవత్సరాల చరిత్ర ఉంది. తాడిపత్రి కేంద్రంగా అనంతపురం నిర్మించిన రాజకీయ సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ కంచుకోట ఒకే ఒక్క ఓటమితో కుప్పకూలిపోయింది. ఎన్నికలకు ముందే జేసీ బ్రదర్స్ ప్రత్యక్ష రాజకీయాలకు బై బై చెప్పేశారు. కానీ.. వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు. అటు జేసీ పవన్ ఇటు జేసీ అస్మిత్ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఒక్కసారిగా జేసీ బ్రదర్స్ సైలెంట్ అయిపోయారు. వైసీపీ మీద ఒంటి కాలితో లేచే జేసీ బ్రదర్స్ మోనం పాటిస్తున్నారు. పైగా జేసీ దివాకర్ రెడ్డి ‘జగన్ మావాడే’ అంటూ డైలాగ్స్ పేల్చి అందరినీ ఆశ్చర్య పరిచాడు. తాడిపత్రిలో కేతిరెడ్డి వర్గం వార్నింగ్ ఇచ్చినా జేసీ బ్రదర్స్ నుంచి రీ కౌంటర్స్ లేవు.
అయితే సైలెంట్ గా ఉన్న జేసీ బ్రదర్స్ ఒక్కసారిగా దూకుడు పెంచడానికి అసలు కారణం బీజేపీనే అన్న చర్చ టీడీపీలోనూ సాగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని జేసీ బ్రదర్స్ ఖండించారు. మరి జేసీ బ్రదర్స్ దూకుడు పెంచడానికి అసలు కారణం ఏంటన్నది వేచి చూడాల్సిందే.