జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నడుంబిగించారు. దీనికోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి ఈ సమావేశాలు మొదలవుతున్నాయి. క్రియాశీలక కార్యకర్తలు, పార్టీ ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు.
విజయవాడలో ఇవాళ ఉదయం 11.00 గంటలకు పార్టీ కమిటీలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.00 గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం కానున్నారు. మంగళ వారం ఉదయం 11.00 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, సాయంత్రం 4.00 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 31న ఉదయం 11.00 గంటలకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నేతలతో సమావేశమవుతారు.
జనసేన పార్టీని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బలోపేతం చేయాలని సూచించనున్నారు. గత ఎన్నికల్లో భారీ అంచనాలు పెట్టుకున్న పార్టీ నేతలు, కేవలం ఒకే ఒక్క అభ్యర్ధి గెలుపుతో ఒక్కసారిగా డీలా పడ్డారు. అయితే తిరిగి పుంజుకునేందుకు, పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్. దీని కోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.