
ఉదయం లేచినప్పటి నుంచి టీ అని, కాఫీ అని, కూల్‌డ్రింక్స్ అని ఇలా రకరకాల విధంగా మనకు తెలియకుండానే మనం మన బాడీలోకి షుగర్‌ను పంపుతాం. ఇలా శరీరంలోకి వెళ్లిన చక్కెర మెల్లమెల్లగా మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది.దీనివల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం (డయాబెటిస్), మొటిమలు, వేగంగా బరువు పెరగడం వంటి అనేక సమస్యలు రావచ్చు. అందుకే చక్కెరను పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

శక్తి స్థాయిలు పెరుగుదల: మనం చక్కెరను ఎక్కువగా తిన్నప్పుడు శరీరానికి తక్షణమే శక్తి లభించవచ్చు, కానీ మనకు ఎనర్జీ ఎంత స్పీడ్‌గా వస్తుందో అంతే స్పీడ్‌గా తగ్గిపోతుంది. దీని వల్ల నీరసం, అలసట ఆవహిస్తాయి. ఎప్పుడైతే మీరు చక్కెర తీసుకోవడం తగ్గిస్తారో, అప్పుడు మీ శరీరం సహజంగా శక్తిని సమతుల్యం చేసుకోవడం నేర్చుకుంటుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.

బరువు తగ్గుతారు: చక్కెరలో శరీరానికి కావాల్సిన ఎలాంటి పోషకాలు ఉండవు, అంతేకాకుండా ఇవి శరీరంలో కొవ్వును వేగంగా పెంచుతాయి. అదే మీరు చక్కెరను తీసుకోవడం ఆపేస్తే.. మీ శరీరం అదనపు కేలరీలను నిల్వ తగ్గుతుంది. తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరగడం స్టార్ట్ అవుతుంది. అంతేకాదు చక్కెర తీసుకోవడం తగ్గిస్తే చాలా వరకు క్రేవింగ్స్ కూడా తగ్గుతాయట.

చర్మ ఆరోగ్యం: అధిక చక్కెర వినియోగం అనేది శరీరంలో కొల్లాజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మంపై ముడతలు రావడం, మొటిమలు పెరగడం, చర్మం కాంతిహీనంగా మారడం జరుగుతుంది. అదే మీరు చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే..చర్మం లోపలి నుంచే సహజంగా కోలుకోవడం ప్రారంభిస్తుంది. చక్కెర తగ్గించిన కొన్ని వారాల్లో మీరు ఈ మార్పును గమనిస్తారు.

గుండె ఆరోగ్యం, సరైన నిద్ర: చక్కెర తగ్గించినప్పుడు గుండెపై పడే ఒత్తిడి తగ్గి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. చక్కెరకు దూరంగా ఉండటం వల్ల హార్మోన్లు సరిగ్గా పనిచేసి, ప్రశాంతమైన గాఢమైన నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది. అంతేకాదు తగ్గిస్తే ఏకాగ్రత పెరగడం, మెదడు చురుగ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు అధిక చక్కెర వాడుతుంటే వెంటనే దాన్ని మానేయండి. ఆరోగ్యంగా ఉండండి.