
వేసవి కాలంలో పుచ్చకాయ (Watermelon)ను మించిన అమృతం మరొకటి ఉండదు. అయితే, రాత్రి సమయంలో పుచ్చకాయ తినడం మంచిదా కాదా..? అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. వేసవిలో అమితంగా ఇష్టపడే ఈ పండును రాత్రి వేళల్లో తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలను తప్పక తెలుసుకోవాలి. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం..

నిద్రకు అంతరాయం: పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. రాత్రి పడుకునే ముందు దీనిని తినడం వల్ల శరీరంలో ద్రవాల నిల్వ పెరుగుతుంది. దీనివల్ల పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. ఫలితంగా మీ గాఢ నిద్రకు భంగం కలుగుతుంది, ఇది మరుసటి రోజు మీ పనితీరుపై ప్రభావం చూపుతుంది.

జీర్ణక్రియ సమస్యలు: రాత్రి సమయంలో మన శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది, దీనివల్ల జీర్ణక్రియ రేటు (Metabolism) తగ్గుతుంది. పుచ్చకాయ కొంచెం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. దీనిని రాత్రిపూట తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ నెమ్మదించి, కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు రాత్రిపూట దీనికి దూరంగా ఉండటమే మంచిది.

రక్తంలో చక్కెర స్థాయిలు: పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే సహజ చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. రాత్రిపూట శారీరక శ్రమ ఉండదు కాబట్టి, ఈ అదనపు చక్కెరలు కొవ్వుగా మారి బరువు పెరగడానికి దారితీయవచ్చు.

ఏ సమయం ఉత్తమం?: పుచ్చకాయ తినడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉదయం లేదా మధ్యాహ్నం. మధ్యాహ్న భోజనానికి ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ మరియు పోషకాలు సమర్థవంతంగా అందుతాయి. రాత్రి 7 గంటల తర్వాత పుచ్చకాయ తినకపోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.