
వెదురు (Bamboo): వెదురు మొక్కలు చాలా వేగంగా విస్తరిస్తాయి. వీటి వేర్లు కాంక్రీట్ ఉపరితలాలు, ముంగిలి (Courtyard) లేదా ఇంటి పునాది కిందకు కూడా చొచ్చుకుపోతాయి. ముఖ్యంగా రన్నింగ్ బ్యాంబూ (Running Bamboo) రకం వేర్లు భూమి లోపల చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఇవి భూగర్భ పైప్‌లైన్లు, వైరింగ్‌లను దెబ్బతీయడమే కాకుండా, ఇంటి ఫ్లోరింగ్‌లో (నేలపై) పెద్ద పెద్ద పగుళ్లు తెప్పిస్తాయి. ఒకసారి ఇవి స్థిరపడితే, వీటిని తొలగించడం చాలా కష్టం.

మర్రి చెట్టు (Banyan Tree): మర్రి చెట్టు పెద్ద నీడను ఇచ్చినప్పటికీ, దీనిని ఇంటి గోడలకు లేదా కాంపౌండ్ వాల్‌కు దగ్గరగా నాటడం పెద్ద ప్రమాదకరం. దీని వేర్లు చాలా దూరం వరకు వ్యాపించి, కాలక్రమేణా చాలా లావుగా మారుతాయి. ఇవి ఇంటి పునాదిని కదిలించి పగుళ్లు తెప్పిస్తాయి. ఫ్లోరింగ్ టైల్స్ ఊడిపోయేలా చేస్తాయి. భూమి కింద ఉన్న డ్రైనేజీ లేదా మంచినీటి పైపులను పూర్తిగా పగులగొడతాయి.

నీలగిరి చెట్టు( యూకలిప్టస్ Eucalyptus): నీలగిరి చెట్టు వేర్లు భూమిలో చాలా లోతుగా, వెడల్పుగా వ్యాపిస్తాయి. ఇవి భూగర్భ జలాలను విపరీతంగా పీల్చేస్తాయి. దీనివల్ల ఇంటి చుట్టుపక్కల ఉండే బోర్‌వెల్ లేదా బావుల్లో నీటి మట్టం తగ్గిపోతుంది. అంతేకాకుండా, ఈ చెట్టు మట్టిలోకి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి పక్కనే ఉండే ఇతర మొక్కలు లేదా పండ్ల చెట్ల ఎదుగుదలను దెబ్బతీస్తాయి. దీని ఆకులు చాలా నిదానంగా కుళ్ళిపోవడం వల్ల మట్టి సారవంతం కాదు.

రావి చెట్టు (Peepal Tree): రావి చెట్టు చాలా వేగంగా, ఎక్కడైనా పెరగగలదు. దీని గింజలు పక్షుల ద్వారా గోడలు, భవనాల పైకప్పులు (Roofs) లేదా డ్రైనేజీ పైపుల చిన్న చిన్న పగుళ్లలో పడితే, అక్కడ కూడా మొక్కలు మొలుస్తాయి. దీని వేర్లు భవన నిర్మాణంలో ఉండే చిన్న సందుల్లోకి చొచ్చుకుపోయి, కాలక్రమేణా వాటిని పెద్దవిగా మారుస్తాయి. దీనివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటి పునాది, గోడలలో తీవ్రమైన పగుళ్లు ఏర్పడతాయి. రావి చెట్టును నాటాలనుకుంటే ఇంటి పునాదికి కనీసం 20 నుండి 25 మీటర్ల దూరం పాటించాలి.

రబ్బర్ చెట్టు (Rubber Plant): రబ్బర్ మొక్క వేర్లు చాలా లావుగా, అత్యంత బలంగా ఉంటాయి. ఇవి భూమిలో విపరీతంగా వ్యాపించడం వల్ల చుట్టుపక్కల ఉండే ఇతర మొక్కలకు పోషకాలు అందకుండా చేస్తాయి. ఇంటికి దగ్గరగా రబ్బర్ చెట్టును నాటినప్పుడు, అది పెద్దదయ్యాక దాని వేర్ల బలానికి ఇంటి గోడలు, కాంక్రీట్ నిర్మాణాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత ఆ చెట్టును వేర్లతో సహా తొలగించడం చాలా ఖర్చుతో కూడుకున్న పనవుతుంది.