
మనం భోజనం చేసేటప్పుడు పక్కన కరకరలాడే అప్పడం ఉంటే ఆ రుచే వేరు. అయితే, అప్పడాలను నూనెలో వేయించడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలా మంది వీటికి దూరంగా ఉంటారు. ఒకవేళ మంటపై కాల్చుకుంటే అవి సరిగ్గా వేగవు లేదా మాడిపోతాయి. మరి నూనె లేకుండా, మంటపై కాల్చకుండా అచ్చం నూనెలో వేయించిన రుచితో అప్పడాలను ఎలా తయారు చేయాలో మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా ఒక సూపర్ టిప్ చెప్పారు.

నూనె లేని అప్పడాల తయారీ - సాధారణంగా మనం ఉప్పును వాడి వేరుశెనగ గుళ్లు లేదా పాప్‌కార్న్ వేయిస్తుంటాం. అదే పద్ధతిని అప్పడాలకు కూడా వర్తింపజేయవచ్చని పంకజ్ వివరించారు. ఒక వెడల్పాటి కడాయిలో తగినంత ఉప్పు వేసి బాగా వేడి చేయాలి. ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత అప్పడాలను అందులో వేసి అటు ఇటు తిప్పాలి. కొద్ది సెకన్లలోనే అప్పడం నూనెలో వేయించినట్లుగా తెల్లగా పొంగుతూ కరకరలాడుతుంది.

మైక్రోవేవ్ అవసరం లేదు: చాలా మంది మైక్రోవేవ్‌లో అప్పడాలు కాలుస్తారు. కానీ అవి అప్పుడప్పుడు గట్టిగా అవుతాయి. అయితే ఈ ఉప్పు పద్ధతిలో అప్పడాలు సాఫ్ట్‌గా, కరకరలాడుతూ వస్తాయి. నూనెలో వేయించిన అప్పడాలలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పద్ధతిలో కాల్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ భయం ఉండదు, పైగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ముఖ్యమైన జాగ్రత్త: ఉప్పులో వేయించిన తర్వాత అప్పడానికి అంటుకున్న ఉప్పును ఒక శుభ్రమైన గుడ్డతో లేదా బ్రష్‌తో తుడిచివేయాలి. ఇలా చేయడం వల్ల అప్పడం మరీ ఉప్పగా లేకుండా ఉంటుంది.

డైటింగ్ చేసేవారు లేదా నూనె వాడకాన్ని తగ్గించాలనుకునే వారు ఈ మాస్టర్ చెఫ్ టిప్‌ను తప్పకుండా ప్రయత్నించవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో హెల్తీ స్నాక్ రెడీ! నూనె వాడకాన్ని తగ్గించి, బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ 'జీరో ఆయిల్' చిట్కా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.