
కావలసిన పదార్థాలు: 4 కప్పుల జొన్న అటుకులు, పావు కప్పు బాదం పప్పు పలుకులు, పావు కప్పు జీడిపప్పు పలుకులు, పావు కప్పు వాల్నట్స్ , పావు కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు పుచ్చగింజలు, పావు కప్పు కిస్మిస్, పావు కప్పు డ్రైడ్ క్రాన్బెర్రీస్ లేకపోతే అర కప్పు కిస్మిస్ వాడుకోవచ్చు. సర్వింగ్ కోసం: 1 కప్పు కాచిన వేడి పాలు లేదా తాజా పెరుగు, కావలసినన్ని తాజా పండ్ల ముక్కలు, 1 టీస్పూన్ తేనె ఐచ్ఛికం - పండ్ల తీపి సరిపోతుంది.

తయారీ విధానం: స్టవ్‌పై వెడల్పాటి పాన్ పెట్టి 4 కప్పుల (250 గ్రాములు) జొన్న అటుకులను వేయాలి. లో-మీడియం మంటపై గరిటెతో కలుపుతూ కేవలం 5 నిమిషాల పాటు క్రిస్పీగా మారే వరకు వేయించి ఒక పెద్ద పళ్లెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే పాన్‌లో పావు కప్పు బాదం పలుకులు వేసి లో ఫ్లేమ్‌పై సగం వేగే వరకు వేయించాలి. బాదం వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది.

బాదం సగం వేగాక పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు వాల్నట్ ముక్కలు వేసి లో ఫ్లేమ్‌పై మరికాసేపు వేయించాలి. ఆ తర్వాత పావు కప్పు గుమ్మడి గింజలు, పావు కప్పు పుచ్చగింజలు వేసి గింజలు చిటపటలాడి లేత రంగు మారే వరకు వేయించి.. అటుకులు ఉన్న పళ్లెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన అటుకులు, నట్స్ మిశ్రమంలో పావు కప్పు కిస్మిస్, పావు కప్పు క్రాన్బెర్రీస్ వేసి చేత్తో అంతా సమంగా కలిసేలా బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని ఎయిర్‌టైట్ డబ్బాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు క్రిస్పీగా, తాజాగా నిల్వ ఉంటుంది. ఒక బౌల్లో 1 కప్పు కాచిన వేడి పాలు లేదా చల్లటి గడ్డ పెరుగు పోయాలి. ఇందులో మనం సిద్ధం చేసుకున్న జొన్న అటుకుల మూస్లీ మిక్స్‌ను 1 కప్పు వేయాలి. పైనుంచి సన్నగా తరిగిన ఆపిల్, అరటిపండు ముక్కలు మరియు దానిమ్మ గింజలను వేసి బాగా కలపాలి.

రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచితే అటుకులు పాలను పీల్చుకుని సాఫ్ట్‌గా నానుతాయి. అంతే, నోరూరించే బలవర్ధకమైన 'జొన్న అటుకుల మూస్లీ' సిద్ధం! డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లలోని సహజ తీపితో పంచదార అవసరం లేకుండానే అత్యంత రుచికరంగా ఉండి.. రోజంతా కడుపు నిండుగా ఉంచి బరువును, షుగర్‌ను సులభంగా నియంత్రిస్తుంది!