
కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఒకటి తరిగిన ఉల్లిపాయ, ఐదు పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, రెండు స్పూన్లు నూనె, సన్నగా రెండు తరిగిన టమాటాలు, చిన్న క్యారెట్ ముక్కలు, చిన్న బంగాళాదుంప ముక్కలు, గ్లాసున్నర నుండి ఒకటి ముప్పావు గ్లాసు ఉప్పు మరియు నీళ్లు.

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో రెండు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి దోరగా వేయించాలి. పప్పులు వేగాక నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తాజా కరివేపాకు వేసి కలపాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు వేసి మూతపెట్టి చిన్న మంటపై వేపాలి.

ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలను ఇందులో వేయాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాకు టమాటా చాలా ముఖ్యం, ఇది మంచి రుచిని ఇస్తుంది. కూరగాయల ముక్కలు నూనెలోనే చక్కగా ఉడికేలా మూతపెట్టి మీడియం మంటపై మగ్గనివ్వాలి. ముఖ్యంగా క్యారెట్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

కూరగాయలు బాగా వేగి మగ్గిన తర్వాత ఒక గ్లాసు రవ్వకు ఒకటిన్నర నుండి ఒకటి ముప్పావు గ్లాసు మాత్రమే నీళ్లు పోయాలి. రెండు గ్లాసుల నీళ్లు పోస్తే ఉప్మా ముద్దగా మారుతుంది, నీళ్లు కాస్త తగ్గిస్తేనే పొడిపొడిగా వస్తుంది. ఇప్పుడు ఎసరులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. నీళ్లు బాగా మరగడం ప్రారంభించిన తర్వాత గోధుమ రవ్వను అందులో వేయాలి. ఎర్ర రవ్వ కాబట్టి ఉండలు కట్టదు, గరిటతో ఒకసారి కలిపితే సరిపోతుంది.

రవ్వ వేసిన తర్వాత మంటను పూర్తిగా సిమ్‌లో పెట్టి మూతపెట్టాలి. ఆవిరిపైనే రవ్వ చక్కగా మగ్గిపోయి నీరంతా ఇంకిపోతుంది. మధ్యమధ్యలో కలపకుండా ఐదు నుండి ఆరు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే రవ్వ పూసల్లా విచ్చుకుని పొడిపొడిలాడుతూ ఉంటుంది. అంతే, ఎంతో ఘుమఘుమలాడే వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా సిద్ధం! వేడివేడిగా ఏదైనా పచ్చడితో లేదా నిమ్మకాయ పిండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.