
సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో దివంగత నటి శ్రీదేవి పేరు ఎప్పటికీ ముందువరుసలో ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. బాలనటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా కూడా శ్రీదేవి రికార్డు సృష్టించారు. 2018లో 54 ఏళ్ల వయసులో శ్రీదేవి అనూహ్యంగా కన్నుమూయడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

ఆమె మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటుగానే మిగిలిపోయింది. ఎన్నో తరాల ప్రేక్షకులను తన నటనతో అలరించిన శ్రీదేవి.. పలువురు స్టార్ హీరోలతో పాటు కొంతమంది హీరోయిన్లతోనూ కలిసి నటించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీదేవితో కలిసి ఉన్న ఓ చిన్నారి ఫోటో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ఫోటోలో కనిపిస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా? చిన్న వయసులోనే శ్రీదేవితో కలిసి కనిపించిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత టాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 90స్ కిడ్స్‌కు ఫేవరెట్‌గా మారింది. ఆమె మరెవరో కాదు.. నటి మహేశ్వరి.

మహేశ్వరి 1995లో వచ్చిన 'అమ్మాయి కాపురం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జేడీ చక్రవర్తి హీరోగా నటించిన 'గులాబీ' చిత్రంతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా విజయం ఆమె కెరీర్‌కు మంచి ఊపునిచ్చింది. తన అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, సహజమైన నటనతో అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహేశ్వరి వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'దెయ్యం', 'మృగం', 'జాబిలమ్మ పెళ్లి' వంటి చిత్రాల్లో కనిపించి మెప్పించారు.

ముఖ్యంగా 'పెళ్లి' సినిమా ఆమె కెరీర్లో చెప్పుకోదగిన విజయంగా నిలిచింది. 'ప్రియరాగాలు', 'వీరుడు', 'నవ్వులాట', 'నీకోసం' వంటి సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించారు. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించిన మహేశ్వరి.. కొంతకాలం పాటు హీరోయిన్గా కొనసాగారు. అయితే ఆ తర్వాత క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. ఆమె చివరిగా 'తిరుమల తిరుపతి వెంకటేశ' చిత్రంలో కనిపించినట్లు సమాచారం. అప్పటి నుంచి వెండితెరకు దూరంగా ఉంటున్నారు.

ఇక మహేశ్వరి గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె దివంగత నటి శ్రీదేవికి దగ్గరి బంధువు. శ్రీదేవి ఆమెకు మేనత్త అవుతారు. ఈ బంధంతోనే శ్రీదేవి కుటుంబంతో మహేశ్వరికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటికీ శ్రీదేవి పిల్లలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తన అందం, అభినయంతో యువత మనసులు గెలుచుకున్న మహేశ్వరి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానుల్లో మాత్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.