
ఏపీలోని ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ మీదుగా కొత్త రైలు సర్వీసును ప్రారంభించింది. మచిలీపట్నం-కర్నూలు మధ్య కొత్త రైలును ప్రవేశపెట్టగా.. ఇది వారానికి మూడుసార్లు నడవనుంది. ఈ కొత్త రైలు సర్వీసుకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఏపీలోని తీర, మధ్య ప్రాంతాల మధ్య ఇది కనెక్టివిటీని నెలకొల్పనుంది. ఏపీలోని ప్రయణికులకు ఇది ఊరటగా చెప్పవచ్చు

మచిలీపట్నం-కర్నూలు మధ్య 499 కిలోమీటర్ల దూరాన్ని ఈ కొత్త రైలు కవర్ చేయనుంది. ప్రతీ సోమ, బుధ, శనివారం ఇది అందుబాటులో ఉంటుంది. కర్నూలు-మచిలీపట్నం మధ్య ప్రతీ మంగళ, గురు, ఆదివారం సర్వీసులు అందించనుంది. ఈ రైలు టైమింగ్స్, ఏయే స్టేషన్లలో ఆగుతాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

మచిలీపట్నంలో ఇది 16.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు 05.45 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో కర్నూలులో 09.30 గంటలకు బయల్దేరి అదే రోజు 21.35 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. విజయవాడ మీదుగా ఈ రైలు నడవనుంది. దీంతో ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలను కవర్ చేయనుంది.

ఈ రైలు గుడివాడ, విజయవాడ, నర్సరావుపేట, వినుకొండ, దొనకోండ, మార్కాపురం, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బెటంచెర్ల, ధోన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. మచిలీపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయనుంది. ఈ మార్గంలోని పట్టణాలకు కనెక్టివిటీని అందిస్తుంది.

అటు త్వరలో దసరా, దీపావళి పండుగలు వస్తున్న క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటిస్తోంది. వీటిల్లో ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్లను ప్రారంభించింది. పండక్కి సొంతూరు వెళ్లేవారికి ఇవి ఉపయోగపడనున్నాయి.