
బంగారం ధరల గురించి తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గోల్డ్ కొనుగోలు చేయకపోయినా సరే రోజువారీ ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. భారతీయులకు బంగారం అంటే ఎంత ప్రతీ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే భారత్‌లో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్‌లో బంగారం ఖరీదైనదిగా ఉంది.

ఈ ఏడాది జనవరిలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకోగా.. ఆ తర్వాత పడిపోతూ వస్తోంది. ఇప్పటివరకు గరిష్ట స్థాయి నుంచి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 21.4 శాతం తగ్గాయి. అయితే దేశీయ మార్కెట్లో మాత్రం 14.9 శాతం మాత్రమే తగ్గాయి. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే భారత్‌లో తక్కువ స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయని చెప్పవచ్చు.

డాలర్‌తో పోలిస్తే భారత రూపీ విలువ బలహీనంగా ఉంది. భారత్ ఎక్కువగా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.96 వరకు ఉంది. దీంతో బంగారంను దిగుమతి చేసుకోవడం వల్ల రూపాయల్లో ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఈ కారణం వల్ల దేశంలో బంగారం ధరల్లో తగ్గుదల అంతర్జాతీయ ధరలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.

ఈ పరిణామాన్ని గమనిస్తే అంతర్జాతీయ ధరలు, భారత ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఇక రెండో కారణం బంగారంపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పెంచడం. దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఇది కూడా ధరలపై ప్రభావితం చూపిస్తుంది. ఈ ఏడాది మార్చిలో దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచింది. అదనంగా 9 శాతం పెరిగినట్లయింది.

ఈ రెండు కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారత్ మార్కెట్లో బంగారం ధరల్లో తేడాలు ఉన్నాయి. డాలర్ బలపడటం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు బాండ్లకు తమ పెట్టుబడులను మార్చుకోవడంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్నాయి. అమెరికా-ఇరాన్ యుద్దం వల్ల ద్రవ్య లభ్యత తగ్గింది. ఇది కూడా ధరల తగ్గుదలకు కారణంగా చెప్పవచ్చు.