
ఉసిరి చేసే మేలు అంత ఇంత కాదు నీరసంగా ఉండే వాళ్ళు కూడా తిరిగేలా చేస్తుంది ఇది అంత ఆరోగ్యకరమైనది. ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అనేక రకాలుగా తీసుకోవడం వల్ల అలసట , కళ్ళు తిరగడం ఇంకా ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలాగే వంటల్లో వాడటం వల్ల కూడా అద్భుతమైన రుచిని అందిస్తుంది.

ఇది సీజనల్ ఫ్రూట్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని మనం ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. అయితే ఉసిరికాయతో ఎన్నో రకాల వంటకాలను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఉసిరికాయ హల్వాను తయారు చేద్దాం.ఇది చాలా బాగుంటుంది. ఇంకా దీనిని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. ఎంతో అద్భుతమైన రుచి కలిగిన ఈ ఉసిరికాయ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు: కప్పు ఉసిరికాయ ముక్కలు , కప్పు బెల్లం తురుము, ఇంకా ఒకటిన్నర నీళ్ళు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, 10 కిస్మిస్, జీడిపప్పు పావు కప్పు, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి అర టీస్పూన్ తీసుకోవాలి. ముందుగా ఉసిరికాయ ముక్కలను తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి.

మళ్ళీ ఇంకో సారి పాన్ తీసుకుని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, తురిమి పెట్టుకున్న ఉసిరికాయను వేసి సన్నని మంట మీద బాగావేయించుకోవాలి. ఉసిరికాయను వేయించినప్పుడు కొంచెం నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం ఇగిరిపోయే వరకు వేయించాలి. అలా వేగిన తర్వాత అందులో బెల్లం తురుము వేసి, చిటికెడు ఉప్పు కలిపి బాగా వేయించుకోవాలి.

ఇంకా దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. అలా వేయించుకుంటూ ఉంటే జెల్లీలా తయారవుతుంది. ఆ విధంగా జెల్లీలా తయారయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అర టీస్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి, మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి.అంతే టేస్టీ టేస్టీ ఉసిరికాయ హల్వా రెడీ!