నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటున్న విపక్షాలు

విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమా? విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడం మఖ్యమా? ఈ భేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడేమో! నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటున్నాయి విపక్షాలు.. వాయిదా వేసే ప్రసక్తే లేదంటోంది కేంద్రం..

నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాల్సిందేనంటున్న విపక్షాలు
Follow us

|

Updated on: Aug 27, 2020 | 1:29 PM

విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమా? విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడం మఖ్యమా? ఈ భేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడేమో! నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటున్నాయి విపక్షాలు.. వాయిదా వేసే ప్రసక్తే లేదంటోంది కేంద్రం.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పరీక్షలను నిర్వహించాలనుకుంటున్నామని కేంద్రం గట్టిగా చెబుతోంది.. విద్యార్థులకు కరోనా సోకదని గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తోంది విపక్షం.. ఇలా లాభం లేదనుకున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాలనుకుంటోంది.

రేపు అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.. స్పీక్‌ ఆఫ్‌ ఫర్‌ స్టూడెంట్‌ సేఫ్టీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్‌ ప్రచారానికి కూడా తెరతీయబోతున్నది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం .. ఇలా అన్ని సోషల్‌మీడియాలలో స్టూడెంట్ల తరఫున కాంగ్రెస్‌ వకాల్తా పుచ్చుకోబోతున్నది.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు.. పరీక్షలను నిర్వహించే సిబ్బందికి కరోనా వైరస్‌ సోకదని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇస్తారా ? అంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా సవాల్ విసిరారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకమయ్యాయి.. ఇప్పుడున్న పరిస్థితులలో పరీక్షలను నిర్వహించకూడదంటూ పట్టుబడుతున్నాయి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆల్‌రెడీ నిర్ణయం తీసుకున్నాయి కూడా! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా పరీక్షలను వాయిదా వేయడమే శ్రేయస్కరమని అంటున్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా అంటే ప్రమాదం ఉంటుందని, అంచేత నిర్ణయం మార్చుకుంటే మంచిదని కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు.. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ అభిప్రాయం కూడా ఇదే! గోవా, బీహార్‌ రాష్ట్రాలు మాత్రం జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణ జరగాల్సిందేనంటున్నాయి.. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 19వేల మంది విద్యార్థులు సెకండరీ, హైయ్యర్‌ సెకండరీ పరీక్షలకు హాజరయ్యారని, ఎవరికీ కరోనా సోకలేదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ అంటున్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని బీహార్‌ ప్రభుత్వం విద్యార్థులకు భరోసా ఇస్తోంది. విద్యార్థుల ఏడాది సమయం వృథా కాకుండా చూసుకోవలసిన బాధ్యత తమ మీద ఉందని చెబుతోంది కేంద్రం, పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నామని, భయపడాల్సిన పని లేదని అంటోంది.. దీన్ని రాజకీయం చేయవద్దంటూ విపక్షాలకు విన్నవించుకుంది.