మునుగోడు ఉప ఎన్నిక రోజురోజుకు ఇంటరెస్టింగ్‌గా మారుతోంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇస్తూ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీని వీడారు. ఆయన బీజేపీలో చేరడం లాంఛనమే అంటున్నారు. గౌడ సామాజిక వర్గం ప్రభావం మునుగోడులో అధికంగా వుంటుందన్న విశ్లేషణల నేపథ్యంలో బూర పార్టీని వీడడంతో దాన్ని బ్యాలెన్స్ చేసుకునే పనిలో వెంటనే సక్సెస్ అయ్యింది గులాబీ పార్టీ. కొన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించిన మాజీ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ గులాబీ గేలానికి చిక్కారు. ఆయన తన భార్య, ఎంపీపీ అధ్యక్షురాలు అయిన కల్యాణితో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బూర నర్సయ్యతోపాటు మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఆశించి భంగ పడిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయన కేటీఆర్‌తో భేటీ అయ్యి గులాబీ పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. అయితే, ప్రస్తుత రాజకీయం డిఫరెంటుగా వుంది. పొద్దటికి, సాయంత్రానికి పరిస్థితి మారిపోతోంది. రాత్రికి ఉదయానికి పరిస్థితి తారుమారవుతోంది. ఈ పరిస్థితి మునుగోడులో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొద్దొగొప్పో ఓటర్లు గుప్పిట వుండే వార్డు మెంబర్ నుంచి ఎంపీటీసీ, సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్లు, మునిసిపల్ ఛైర్మెన్లు ఇలా ఎవరి స్థాయిలో వారు స్వప్రయోజనాలకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. జంప్ జిలానీలుగా పేరుగాంచుతున్నారు. ఇక కాస్తో కూస్తో పేరున్న నాయకులైతే వారికి గేలమేస్తున్న పార్టీలు ముందుగా సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించి, అన్నీ సెట్ అయ్యాక మీడియాకు లీకులు వదులుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ విషయంలో ఇదే జరిగింది. మునుగోడు టిక్కెట్ ఆశించిన బూర నర్సయ్య గౌడ్‌కు టిక్కెట్ నిరాకరించిన గులాబీ బాస్ కేసీఆర్.. ఆ తర్వాత ఆయనకు అపాయింట్‌మెంటు కూడా ఇవ్వకపోవడంతో బూర తీవ్ర స్థాయిలో అవమానకరంగా ఫీలయ్యారు. వృత్తిరిత్యా వైద్యుడైన బూర నర్సయ్య గౌడ్ పూర్తి స్థాయి పొలిటీషియన్ కాకపోవడంతో కేసీఆర్ చేతిలో ఎదురైన అవమానాన్ని తట్టుకోలేకపోయి వుంటారని తెలుస్తోంది. అదే పూర్తి స్థాయిలో పొలిటీషియన్ అయితే ఇలాంటి అవమానాలను పెద్దగా పట్టించుకునే వాడు కాదేమో. తన పట్ల హ్యూమిలియేషన్ తీవ్రస్థాయిలో జరిగిందన్న అంశాన్ని పార్టీ వీడిన తర్వాతగానీ బయటపెట్టలేదు. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బూర తన పట్ల గులాబీ అధినేత ఎలా వ్యవహరించారో వెల్లడించి, తన ఆవేదన వ్యక్తం చేశారు. సరే.. ఇదంతా పక్కన పెడితే.. మునుగోడులో గౌడ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా వున్నాయి. 38 వేలకు పైగా గౌడ సామాజిక వర్గం ఓట్లు మునుగోడు సెగ్మెంటులో వున్నాయి. వారి తర్వాత గొల్ల, కురుమల ఓట్లు 34వేలకుపైగా వున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో గౌడ సామాజిక వర్గం నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో మూడు ప్రధాన పార్టీలున్నాయి గతంలో ఎంపీగా గెలిచిన బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వైపు వెళుతున్నారు. ఆయన లోటును భర్తీ చేసుకునేందుకు టీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పల్లె రవికుమార్ గౌడ్ దంపతులకు గేలమేశారు. ఏతావాతా కాంగ్రెస్ పార్టీనే ఓ పార్టీ నాయకున్ని కోల్పోయింది. బూర రాకతో బీజేపీకి ఓ ఎంపీ స్థాయి నేత ప్లస్సయ్యారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు వెళ్ళిపోగా మరొకరు జతకలిశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓ స్థానిక లీడరును కోల్పోయి నష్టపోయింది. మాజీ ఎంపీ అయిన బూర నర్సయ్యగౌడ్‌తో ఇంతవరకు ఏ ఎన్నికలోను గెలవని పల్లె రవిని సరిపోల్చడం తగునో లేదో చెప్పలేం. కాకపోతే వీరి ప్రభావం విషయానికి వస్తే బూర నర్సయ్య మునుగోడులో స్థానికుడు కాదు.. అదే సమయంలో పల్లె రవి మునుగోడు నియోజకవర్గంలోని ప్రధాన మండలం చండూరుకు చెందిన వారు. ఆయన భార్య కల్యాణి చండూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా వున్నారు. సో.. ఎవరి ప్రభావం ఎంత అన్నది ఎన్నిక ఫలితం తేలితేగానీ చెప్పలేం.
ఇక ఇదే ఊపులో బీజేపీ మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలకు గేలమేస్తున్నట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ని, మునుగోడు టిక్కెట్ ఆశించిన భంగపడిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ని బీజేపీలో చేర్చుకునేందుకు ఆకర్ష్ కన్వీనర్ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో కర్నె ప్రభాకర్ ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు, మంత్రి కేటీఆర్‌ను కలిసి, క్లారిటీ ఇవ్వగా .. పద్మారావు గౌడ్ సంగతింకా తేలలేదు. మునుగోడు ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో వున్నారు. తమ సిట్టింగ్ సీటు కాబట్టి తామే దానిని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అధికారంలో వున్నాం కాబట్టి మునుగోడులో విజయం సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్‌గా వుంటుందని టీఆర్ఎస్ పార్టీ తలపోస్తోంది. ఈ మూడు పార్టీల్లో ఇటు బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఆర్థికంగా బలంగా వున్నారు. వీరిద్దరితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాస్త వెనుకబడ్డారనే చెప్పాలి. ఇక్కడో అంశం ప్రస్తావనార్హంగా కనిపిస్తోంది. తెలంగాణలో మరో ఏడాదిలోపు ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇపుడు మునుగోడులో గెలిచే ఎమ్మెల్యే గరిష్టంగా 11 నెలలు మాత్రమే పదవిలో వుంటారు.
ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. ఇక ప్రస్తుతం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న ముగ్గురిలో ఒక్క రాజగోపాల్ రెడ్డికే ఆర్థికంగా ఆ సత్తా వుందని అనుకోవాలి. ఆయన పేరుమోసిన కాంట్రాక్టర్. వివిధ రాష్ట్రాలలో రాజగోపాల్ రెడ్డికి నిర్మాణరంగ కాంట్రాక్టులున్నాయి. సో.. ఏడాదిలోపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజగోపాల్ రెడ్డికి ఆర్థిక వనరులను సమకూర్చుకుని పూర్తి స్థాయిలో రంగంలోకి దిగగలిగే సత్తా వుంది. మరి మిగిలిన ఇద్దరికి ఆ సామర్థ్యం వుందా అంటే అనుమానమే అని చెప్పాల్సి వస్తుంది. ఇపుడు మునుగోడులో సత్తా చాటగలిగితే బీజేపీ అధిష్టానం ఆయన్ను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నాయి. మోదీ చరిష్మాకు రాజగోపాల్ రెడ్డి అర్థబలం తోడైతే తమ ఖాతాలో ఓ ఎంపీ సీటు పడుతుందన్నది బీజేపీ హైకమాండ్ వ్యూహంగా వుండే ఛాన్సుంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికీ ఉప ఎన్నిక లిట్మస్ టెస్టు అని చెప్పాలి. తాను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా మునుగోడులోనైనా మెరుగైన ప్రదర్శన చేయడం అభ్యర్థి పాల్వాయి స్రవంతి కంటే కూడా రేవంత్ రెడ్డికే ఎక్కువ అవసరంగా కనిపిస్తోంది. మునుగోడులో విజయం సాధించకపోతే అధిష్టానం మాట దేవుడెరుగు.. పార్టీలో చాపకింద నీరులా తనకు వ్యతిరేకంగా వున్న అసంతృప్త నేతల కామెంట్లను తట్టుకోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి ప్రాప్తించక తప్పదు.