ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. నేరాలను అరికట్టడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పలు నిర్ణయాలతో చెప్పకనే చెప్పేస్తున్నారు. తాజాగా జైలులో ఉన్న ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు యోగి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేబినెట్ సమావేశంలో ఆజం ఖాన్ జోహార్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకుంది. ఎస్పీ ప్రభుత్వ హయాంలో రాంపూర్‌లోని ముర్తాజా హయ్యర్ సెకండరీ స్కూల్ భవనంతో సహా మొత్తం క్యాంపస్‌ను మౌలానా మహ్మద్ జోహార్ ట్రస్ట్‌కు 99 ఏళ్ల లీజుపై అజంకు ఇచ్చారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన ఈ 3825 చదరపు మీటర్ల భూమికి వార్షిక అద్దె కేవలం రూ.100 మాత్రమే.
ఈ భూమి కోసం సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆజం ఖాన్ ఒప్పందం కూడా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ప్రభుత్వం లీజును రద్దు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, వివిధ శాఖల నుండి వచ్చిన దాదాపు 12 ప్రతిపాదనలపై చర్చించారు, అందులో విద్యా శాఖ నుండి ఈ భూమికి సంబంధించిన ప్రతిపాదన కూడా చేర్చబడింది. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఏకంగా భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆజంఖాన్ కార్యాలయంతో పాటు రాంపూర్ పబ్లిక్ స్కూల్ స్థలం కూడా ఖాళీ కానుంది. బీజేపీ ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా ఈ అంశాన్నిలేవనెత్తారు. ప్రభుత్వం వద్ద తీసుకున్న భూమి లీజు నిబంధనలను ఆజంఖాన్ ఉల్లంఘించారని ఎమ్మెల్యే ఆరోపించారు.
తోప్‌ఖానా రోడ్లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకున్న తర్వాత ఇక్కడ ఆజం ఖాన్ పార్టీ కార్యాలయంతో పాటు దారుల్ అవామ్ , రాంపూర్ పబ్లిక్ స్కూల్‌ను నిర్మించారు. ఇప్పుడు లీజు రద్దు చేయడంతో త్వరలో ప్రభుత్వం ఈ కోట్ల విలువ జేసే ఈ భూమిని స్వాధీనం చేసుకోనుంది.
ఎస్పీ ప్రభుత్వంలో ఉన్న తన ప్రభావాన్ని ఉపయోగించి ఆజంఖాన్ ప్రభుత్వ ముర్తజా హయ్యర్ సెకండరీ స్కూల్ భవనం, స్థలాన్ని విద్యాశాఖ నుంచి లీజుకు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో తోప్‌ఖానా రోడ్లో దారుల్ అవామ్ , రాంపూర్ పబ్లిక్ స్కూల్ తో పాటు తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి, దారుల్ ఆవామ్ ఉన్న భవనంలో, జిల్లా పాఠశాల ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండగా, రాంపూర్ పబ్లిక్ స్కూల్ భవనంలో, జిల్లా ప్రాథమిక విద్యా అధికారి కార్యాలయం ఉంది.
2012లో మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ పేరిట ఆజం ఈ భవనాన్ని లీజుకు తీసుకున్నాడు. ఈ లీజు డీడ్‌లోని పాయింట్ నంబర్ 7లో కేటాయించిన భూమిలో విశ్వవిద్యాలయం నిర్మించబడుతుందని.. నిర్మాణం పనులను ఒక సంవత్సరంలోపు ప్రారంభిస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ భూమిని ఇతర అవసరాలకు వినియోగించరాదని ఇందులో నిబంధన పెట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే డీఎంకు ఫిర్యాదు చేశారు. డీఎం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా కేబినెట్ లీజును రద్దు చేసింది.
దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టంపై విచారణ చేసేందుకు డీఎం రవీంద్రకుమార్ మందార్ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారిక వర్గాల ప్రకారం ఆజం ఖాన్ ఈ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఇక్కడ 4000 మంది పిల్లలు చదువుతున్నారు.
ఇది లావుండగా ఆజంఖాన్ ప్రభావంతో ఏ అధికారి కూడా అభ్యంతరం చెప్పే ధైర్యం చూపకపోవడంతో ఆ భూమిని ఖాళీ చేసి ఆజంఖాన్‌కు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ప్రభుత్వం ఉంది. అజం ఖాన్ స్వయంగా క్యాబినెట్ మంత్రి , పట్టణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమం వంటి ఏడు బలమైన శాఖలను కలిగి ఉన్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..