ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలిలో ఇవాళ, రెండోరోజున (ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం కోసం క్యాడర్ ఎదురుచూస్తోంది. రెండోరోజు సమావేశాలు ఉదయం తొమ్మిదిగంటలకు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కొన్ని తీర్మానాలు ఉంటాయి. అలాగే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా చేపడతారు. అలాగే, ప్రధానమంత్రి అభ్యర్థిని కూడా లాంఛనంగా ఎన్నుకుంటారు. మధ్యాహ్నం ప్రధాని ప్రసంగంతో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు ముగుస్తాయి. కాంగ్రెస్ – ఇండియా కూటమి నిరాశ రాజకీయాలు అన్న అంశంపై పదిన్నరకు అమిత్ షా తీర్మానం ప్రవేశపెడతారు. కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, DMK, తృణమూల్ వంటి పార్టీలపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పతనం తప్పదనే సంకల్పం బీజేపీ తీర్మానంలో ఉంటుందని సమాచారం.
అయితే, ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు, యావత్ బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ ఇచ్చే బిగ్ మెసేజ్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. బయటకు కనిపిస్తోంది మాత్రం- విపక్షాలపై మోదీ విరుచుకుపడటమే. కానీ తమ కేడర్‌కు కూడా కాస్త గట్టిగానే ఆయన పాఠాలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ధమాకా విజయం సాధించి, కేంద్రంలో హ్యా్ట్రిక్ కొట్టాలంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. బీజేపీ జాతీయ మండలి సమావేశాలకు హాజరైన 11,500 మంది ప్రతినిధులకు తొలిరోజున ఈ విషయాన్ని కరాఖండీగా చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల కోసం టికెట్లు ఆశిస్తున్నవారికి, మళ్లీ టికెట్ కోరుతున్న సిట్టింగులకు తన సారాంశాన్ని మోదీ సూటిగా చెప్పబోతున్నారు. 370 సీట్లు సాధించాలనే రేసులో, గెలుపుగుర్రాలకే ప్రాధాన్యం అంటూ సంకేతాలు ఇచ్చారాయన. కమలం గుర్తే పార్టీ అభ్యర్థి అనీ మోదీ చెప్పారు. అంటే, మెజారిటీ సీట్లలో అభ్యర్థులను మార్చే అవకాశం కూడా ఉందంటూ కాషాయ సారథి పరోక్షంగా చెప్పినట్లయింది. అంటే, విజయానికి తమ సైనికులను మానసికంగా సన్నద్ధం చేశారు. కిందిస్థాయిలో పార్టీని బలంగా తయారుచేయాలని మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు.
ఈ ఎన్నికల్లో 370 సీట్లు సాధించాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై మోదీ మరో కోణాన్ని చాటుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 161 సీట్లపై ఫోకస్ చేశారు. వీటిలో కనీసం 67 సీట్లు గెలవాలంటూ పార్టీ కేడర్‌కు కర్తవ్యబోధ చేసే పని కూడా సాగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే, తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విజయాలను జనానికి వివరించాలని కోరుతున్నారు. అలాగే, 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత, నిర్వహించిన 26 ఎన్నికల్లో 16 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందనీ మోదీ తమ కేడర్‌కు చెప్పారు. ఈ విజయాల కిక్‌తో మరో ధమాకా విజయం సాధించి, చరిత్ర సృష్టించాలని మోదీ ఈ మధ్యాహ్నం తమ కేడర్‌కు చెప్పబోతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..