విజయ్ దెబ్బకు ద్రవిడ పార్టీల్లో కదలిక.. ‘జెన్ జెడ్’ మంత్రం జపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే!

దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాట జెన్ జెడ్ ఓటర్ల ప్రాధాన్యత పెరిగింది. ఆయన పార్టీ యువతకు పెద్దపీట వేయడంతో, ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే సైతం యువతను ఆకర్షించే వ్యూహాలను అవలంబిస్తున్నాయి. డీఎంకే సంస్థాగత మార్పులు చేపట్టి, జిల్లా స్థాయి పదవుల్లో వయోపరిమితులు విధించి, యువతకు అవకాశాలు కల్పిస్తోంది. ఈ పరిణామాలు తమిళ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి.

విజయ్ దెబ్బకు ద్రవిడ పార్టీల్లో కదలిక.. ‘జెన్ జెడ్’ మంత్రం జపిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే!
Tamil Nadu Cm Vijay Impact On Dmk And Aiadmk

Edited By:

Updated on: Aug 22, 2026 | 6:13 PM

దేశ రాజకీయాల్లో ఇపుడు ఇక పదం ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పదాన్ని ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా దశాబ్దాల చరిత్ర గల పార్టీలు అయినా మూల్యం చెల్లించక తప్పదు అన్నట్లు మారాయి ప్రస్తుత పాలిటిక్స్..! అదే జెన్ జెడ్ అనే పదం.. ఇటీవల వ్యంగ్యంగా ఏర్పాటైన కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత ఈ పదం తాలూకు సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు దశాబ్దాలు రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు కూడా ఇపుడు అదే మంత్రాన్ని జపిస్తున్నాయి.. అంతే కాదు వారిని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది..

ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా జెన్ జెడ్ ఓటర్లను ఆకట్టుకోవడం, యువతను పార్టీ వ్యవహారాల్లోకి తీసుకురావడం ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలక వ్యూహంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాడులో యువ ఓటర్ల ప్రాధాన్యత మరింత పెరిగింది. దీంతో దశాబ్దాల చరిత్ర ఉన్న ద్రవిడ పార్టీలూ అదే బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)లో యువతకు పెద్దపీట వేస్తున్న విషయం ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీ నిర్మాణంలోనూ, కీలక బాధ్యతల్లోనూ యువతకు అవకాశాలు కల్పిస్తూ విజయ్ ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జెన్ జెడ్ ఓటర్లు రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉండటంతో.. వారిని ఆకర్షించేందుకు టీవీకే అనుసరిస్తున్న వ్యూహం ఇతర పార్టీలపై కూడా ప్రభావం చూపుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

డీఎంకే – అన్నాడీఎంకేలో భారీ మార్పులు..!

ఇదే సమయంలో అన్నాడీఎంకే కూడా పార్టీ జిల్లా స్థాయి బాధ్యతల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు వేసింది. తాజాగా డీఎంకే కూడా సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీ యువ నేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆలోచనలకు అనుగుణంగా యువతకు మరిన్ని పార్టీ పదవులు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సంస్థాగత మార్పులపై చర్చించారు. కొత్తగా నిర్ణయించిన నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి పదవుల్లో వయోపరిమితులు, పదవీకాలానికి సంబంధించిన మార్పులు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

డీఎంకేలో భారీ ప్రక్షాళన?

జిల్లా అధ్యక్ష పదవుల సంఖ్యను 110కి పెంచడంతో పాటు.. 70 ఏళ్లలోపు వారికి ఆ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒక వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవిని గరిష్టంగా రెండుసార్లు మాత్రమే చేపట్టే అవకాశం కల్పించనున్నారు. జిల్లా కార్యదర్శుల విషయంలో 60 ఏళ్లలోపు వయోపరిమితి విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాల్లో పార్టీ కోఆర్డినేటర్లకు 45 ఏళ్ల వయోపరిమితి నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిబంధనల అమలుతో సీనియర్ నేతల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ.. పార్టీ భవిష్యత్తు, యువ ఓటర్లను ఆకర్షించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు తప్పనిసరి అని డీఎంకే నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల కారణంగా 100కు పైగా కీలక పార్టీ పదవులు ఖాళీ అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఖాళీలను యువ నాయకులతో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జెన్ జెడ్ సభ్యులకు కీలక బాధ్యతలు!

మరోవైపు టీవీకే ఇప్పటికే పెద్ద సంఖ్యలో జెన్ జెడ్ సభ్యులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో యువతను రాజకీయాల్లోకి తీసుకురావడంలో విజయ్ వ్యూహం.. ఇప్పుడు తమిళనాడులోని సంప్రదాయ ద్రవిడ పార్టీలను కూడా ప్రభావితం చేస్తోందనే చర్చ మొదలైంది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లు ఎటువైపు మొగ్గుతారన్నది కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో పార్టీ పాత నిర్మాణాన్ని మార్చి.. కొత్త తరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తమ రాజకీయ భవిష్యత్తును బలోపేతం చేసుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే సీనియర్ నేతల అనుభవం, యువత ఉత్సాహం మధ్య పార్టీలు ఎలాంటి సమతుల్యత సాధిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us