AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటర్లకు వెల్‌కమ్ చెప్పిన అనుకోని అతిధి.. ఆ సీన్ చూసి యువత ఫిదా.!

తమిళనాడు శాసనసభ ఎన్నికల వేళ కోయంబత్తూరులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో ప్రజాస్వామ్య పండుగ సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. నూటికి నూరు శాతం ఓటింగ్ సాధించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన వినూత్న ప్రయోగాలు ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఓటర్లకు వెల్‌కమ్ చెప్పిన అనుకోని అతిధి.. ఆ సీన్ చూసి యువత ఫిదా.!
Robot In Polling Both , Coimbatore
Balaraju Goud
|

Updated on: Apr 23, 2026 | 12:39 PM

Share

తమిళనాడు శాసనసభ ఎన్నికల వేళ కోయంబత్తూరులో ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో ప్రజాస్వామ్య పండుగ సరికొత్త హంగులతో మెరిసిపోతోంది. నూటికి నూరు శాతం ఓటింగ్ సాధించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన వినూత్న ప్రయోగాలు ఓటర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా, కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ‘టీనా’ అనే రోబో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసులు లేదా అధికారులను చూస్తుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్! ఓటు వేయడానికి వచ్చిన వారిని ‘టీనా’ రోబో తన పళ్ళెంలో ఉన్న చాక్లెట్లు, పువ్వులతో చిరునవ్వుతో ఆహ్వానిస్తోంది. కోయంబత్తూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు కలిసి రూపొందించిన ఈ రోబోట్, ఓటర్లకు సరికొత్త అనుభూతిని పంచుతోంది.

టీనా కేవలం స్వాగతం పలకడానికే పరిమితం కాలేదు. ఒక బాధ్యతాయుతమైన ఎన్నికల సహాయకురాలిలా కూడా వ్యవహరిస్తోంది. ఇందులో అమర్చిన ప్రత్యేక స్పీకర్ల ద్వారా ఓటర్లకు అవసరమైన సూచనలు అందిస్తోంది. ఓటు వేయడానికి తీసుకురావాల్సిన గుర్తింపు కార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రం లోపల ఉన్న సౌకర్యాల గురించి వివరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైందో వివరిస్తూ చైతన్యపరుస్తూ ఓటర్లను తెగ ఆకర్షిస్తోంది.

ఈ టెక్నాలజీ మ్యాజిక్ చూసి ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువత, విద్యార్థులు ఫిదా అవుతున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద ఉండే టెన్షన్ మర్చిపోయి, ఉత్సాహంగా టీనాతో సెల్ఫీలు దిగుతున్నారు. ఒక వృద్ధుడు మాట్లాడుతూ.. “రోబో చాక్లెట్లతో స్వాగతం పలకడం చాలా గమ్మత్తుగా ఉంది. ఇది చూడటానికే నా మనవళ్లను కూడా తీసుకొచ్చాను” అని ఓ వృద్ధ ఓటరు మురిసిపోయారు.

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను సామాజిక ప్రయోజనం కోసం వాడాలనే ఉద్దేశంతో విద్యార్థులు ఈ చొరవ తీసుకున్నారు. ఇటువంటి వినూత్న ప్రయోగాలు ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచుతాయని ఎన్నికల అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ‘రోబో’ సక్సెస్‌ను చూసి, భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రాంతాల్లో ఇలాంటి టెక్నాలజీని వాడేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి, కోయంబత్తూరులో ‘టీనా’ రోబో సందడి చూస్తుంటే.. భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుందని అర్థమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us