Neet Exam
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) లీకేజి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం (జులై 20) మధ్యాహ్నం గం. 12.00 వరకు అభ్యర్థుల మార్కులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. నగరాలు, పరీక్ష కేంద్రాల వారిగా ఈ మార్కుల వివరాలను పొందుపరుస్తూనే.. విద్యార్థుల ఐడెంటిటీని మాత్రం బయటపెట్టవద్దని స్పష్టం చేసింది. గురువారం (జులై 18) సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)తో పాటు కేంద్ర ప్రభుత్వానికి, కేసులోని పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధించింది. తదుపరి విచారణ జులై 22కు వాయిదా వేస్తూ.. ఆ రోజే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అయితే విచారణ సందర్భంగా పరీక్ష రద్దు కోరుతున్న పిటిషనర్లు లేవనెత్తిన అనేక సందేహాలు, అనుమానాలను నివృత్తి చేసే క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. అలాగే పిటిషనర్లను సైతం కొన్ని అంశాలపై ప్రశ్నించింది.
సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు:
- నీట్ (NEET-UG) ర్యాంకులను విశ్లేషిస్తే.. టాప్ 100లో ఆంధ్రప్రదేశ్ 7, బీహార్ 7, హర్యానా 4, ఢిల్లీ 6, మహారాష్ట్ర 4, తమిళనాడు 6.. ఇలా మొత్తం 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి అభ్యర్థులు ఉన్నారని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) డీవై చంద్రచూడ్ అన్నారు. గ్రేస్ మార్కులు కలిపి, ఆ తర్వాత రద్దు చేసిన 1,563 మంది అభ్యర్థులకు రీ-ఎగ్జామినేషన్ పెట్టగా.. వారిలో టాప్ 100లోపు ఎంత మంది వస్తారో చూడాలని, ఈ అంశంపై NTA సమాధానం చెప్పాలని పేర్కొంది.
- ఎవరైనా పేపర్ లీక్ చేయాలనుకుంటే.. వారి ఉద్దేశం కేవలం నీట్ పరీక్షల పరువు తీయడమే కాదని, లీక్ చేసిన పేపర్ ద్వారా సొమ్ము చేసుకోవడమేనని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఇది దర్యాప్తు సంస్థ తేల్చాల్సి ఉంటుందని వెల్లడించింది.
- NTA అందించిన సమాచారం ప్రకారం మే 5న ఉదయం పేపర్ లీకైంది. లీకైన ప్రశ్నాపత్రాన్ని, వాటి సమాధానాలను గుర్తుపెట్టుకోవాలని అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి. అంటే మే 5న ఉదయం ముందు ఎవరో ప్రశ్నపత్రానికి తగిన సమాధానాలను సిద్ధం చేశారు. ఇలా జరగాలి ఉంటే పేపర్ ఒక రోజు ముందు రాత్రి.. అంటే మే 4న రాత్రి లీక్ అయి ఉండాలి. సరిగ్గా ఎప్పుడు లీకైంది అన్న ప్రశ్నకు సమాధానం కావాలి.
- ఒక్క గంటలో పేపర్‌ని సాల్వ్ చేసి అభ్యర్థులకు సమాధానాలతో సహా అందించడం పూర్తిగా ఊహాజనితమే అవుతుంది. ఎన్టీఏ చెబుతున్నట్టు అభ్యర్థులకు ఉదయం 10 గంటల తర్వాత పేపర్ వస్తే ఉదయం 9:30 నుంచి 10:15 గంటల వరకు.. అంటే కేవలం 45 నిమిషాల్లో పేపర్‌లోని ప్రశ్నలకు సమాధానాలు వెతికి అభ్యర్థులకు అందజేసే అవకాశం ఉందా? ఇది కాస్త విడ్డూరంగా అనిపించడం లేదా?
- ప్రశ్నపత్రం ఎప్పుడు వచ్చిందో సీబీఐ విచారణలో తేలిపోతుంది. లీకైనప్పటి నుంచి పరీక్ష నిర్వహించే వరకు మిగిలిన సమయం ఎంత అన్నది తేల్చాలి. ఇది ఎంత తక్కువగా ఉంటే, లీకేజి విస్తృతి అంత తక్కువగా ఉంటుంది. 45 నిమిషాల ముందు లీకైన పేపర్‌కు రూ. 75 లక్షలు చెల్లించారా?
- పాట్నా మరియు హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్ లీక్ జరిగిందని చెబుతున్నారు. దీని ఆధారంగా మాత్రమే మొత్తం పరీక్షను రద్దు చేయగలమా?
- పాట్నా నుంచి హజారీబాగ్‌కి లీకైన పేపర్ ఎలా చేరింది? 180 ప్రశ్నలతో కూడిన మొత్తం ప్రశ్నపత్రానికి 45 నిమిషాల్లో సమాధానాలు సిద్ధం చేయగలరో లేదో తెలియదు, కానీ హజారీబాగ్, పాట్నాలో పేపర్ లీక్ అయిందనడంలో సందేహం లేదు.
- పేపర్ లీకేజీ పెద్ద ఎత్తున జరిగిందనీ, ఈ కారణంగా పరీక్షను రద్దు చేయాలన్న అభ్యర్థనకు తగిన ఆధారాలు ఉన్నాయా? పిటిషనర్లను ప్రశ్నించిన సుప్రీంకోర్టు ధర్మాసనం. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ తాను మళ్లీ పరీక్ష నిర్వహించాలని కోరుకుంటున్న అభ్యర్థుల పక్షాన ఉంటానని చెప్పారు. వాదనలకు బలం చేకూర్చే ఆధారాలు కావాలని కోర్టు పేర్కొంది.
- దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పరీక్ష రాయగా.. అడ్మిషన్లు పొందేది మాత్రం 1.8 లక్షల మంది మాత్రమే. మిగిలిన 22 లక్షల మంది ప్రవేశం పొందే అవకాశం లేనప్పుడు మొత్తం పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం ఉందా? సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ వివరాలు బహిర్గతమైతే, నేరానికి పాల్పడిన వ్యక్తులు జాగ్రత్తపడతారు కదా?
- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 5వ తేదీన NEET-UG పరీక్షను నిర్వహించింది. ఇందులో 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో 23.33 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 14 విదేశీ నగరాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో కేంద్రం, ఎన్టీఏలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తమ అఫిడవిట్‌లలో పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయితీగా పరీక్ష రాసి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని, అది కూడా పెద్ద ఎత్తున పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేనప్పుడు రీ-టెస్ట్ నిర్వహించడం సరికాదని పేర్కొంది.
వాదనల్లో భాగంగా మద్రాస్ ఐఐటీ ఇచ్చిన నివేదికపై కూడా చర్చ జరిగింది. గత రెండేళ్ల పరీక్ష ఫలితాలతో ఈ ఏడాది పరీక్ష ఫలితాలను విశ్లేషించినప్పుడు అసాధారణ స్థాయిలో ఒక ప్రాంతంలో లేదా ఒక సెంటర్లో అసాధారణ స్థాయిలో మార్కులు వచ్చినట్టు ఎక్కడా గుర్తించలేదని వెల్లడించింది. అయితే 720కి 720 మార్కులతో ఏకంగా 67 మంది టాప్ ర్యాంక్ సాధించడం వెనుక 25% సిలబస్ తొలగించడమే కారణమని అభిప్రాయపడింది. దేశంలో ప్రతి నగరంలో, ప్రతి సెంటర్ ఫలితాలను విశ్లేషించగా.. ఎందులోనూ అసాధారణ పరిస్థితి గమనించలేదని పేర్కొంది. సాధారణంగా ర్యాంకులను ఓ ఆకృతిలో పెడితే బెల్ (గంట) ఆకృతిలో వస్తాయని, టాప్ ర్యాంక్ సాధించినవాళ్లు అతి కొద్ది మంది, ఓ మోస్తరు ర్యాంకులు సాధించినవారు కాస్త ఎక్కువ మంది, చాలా దూరంగా ఉన్న ర్యాంకులు సాధించినవాళ్లు మరింత ఎక్కువ మంది ఉంటారు. ఈసారి జరిగిన పరీక్షలు కూడా అలాగే ఉన్నాయని ఐఐటీ మద్రాస్ నివేదిక పేర్కొంది. మొత్తంగా నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు పరీక్ష రాసిన అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులు, విద్యార్థులను ఆందోళనకు గురిచేశాయి. సోమవారం వెలువడబోయే తుది తీర్పు కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..