West Bengal: ‘ఈ సారి ఆట భయంకరంగా ఉంటుంది’.. బెంగాల్‌ బీజేపీ చీఫ్ మజుందార్‌ సంచలన వ్యాఖ్యలు..

|

Dec 03, 2022 | 9:09 PM

రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలూ ఆట ఆడతాయని, అయితే ఈసారి ఆట చాలా భయకంరంగా ఉంటుందంటూ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ వ్యాఖ్యానించారు. తృణమూల్‌ కాంగ్రస్‌ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి..

West Bengal: ‘ఈ సారి ఆట భయంకరంగా ఉంటుంది’.. బెంగాల్‌ బీజేపీ చీఫ్ మజుందార్‌ సంచలన వ్యాఖ్యలు..
Sukanta Majumdar on Mamata Banerjee
Follow us on

పశ్చిమ్‌ బెంగాల్‌లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార టీఎంసీని టార్గెట్‌ చేస్తూ బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ వాడే ‘ముందుంది అసలైన ఆట’ (ఖేలా హోబే) నినాదంతో టీఎంసీని బీజేపీ సవాల్ చేసింది.  రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలూ ఆట ఆడతాయని, అయితే ఈసారి ఆట చాలా భయకంరంగా ఉంటుందంటూ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలతోపాటే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే అవకాశముందని.. దీనికోసం బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. బీజేపీ అహింసను విశ్వసిస్తుందని.. రంగంలోకి దిగాల్సి వస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని సుకాంత మజుందార్ స్పష్టంచేవారు. ఈ సారి ఆట ప్రమాదకరంగా ఉంటుందని తెలిపారు. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బరాక్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో సుకాంత మజుందార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆస్తులను అమ్మేస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కొన్నేళ్లలో గద్దె దింపడం ఖాయమని మజుందార్‌ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను సూచిస్తూ 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు.

2021 ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన కేసుల్లో సుమారు 300 మంది టీఎంసి కార్యకర్తలు జైలులో ఉన్నారని, వీటిని సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని మజుందార్ పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఏ పెద్ద పదవిలో ఉన్నా, ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నంత కాలం తప్పించుకోలేరని మజుందార్ అన్నారు. పోలీసు యంత్రాంగం తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకువస్తామని మజుందార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీకి పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల జీతాలు ప్రజల పన్ను చెల్లింపుల నుంచి ఇస్తున్నారని.. ఏ రాజకీయ సంస్థ నుంచి కాదని.. ఇది అర్ధం చేసుకోని తటస్థంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

కాగా.. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం 2021లో వరుసగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినవిషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు “ఖేలా హోబే” అనే నినాదాన్ని రూపొందించింది. ఇది విపరీతమైన ప్రజాదరణ పొందింది. పశ్చిమ బెంగాల్ లోని అనేక ఇతర పార్టీలు కూడా ఈ నినాదాన్ని ఉపయోగించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..