ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ ఉండే రక్షణ ఎలా ఉంటుంది? ఎంతమంది సెక్యూరిటీ ఉంటారు? విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రధాని రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు భద్రతా ఏ స్థాయిలో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంటి? భద్రతా ప్రోటోకాల్ ఏం చెబుతోంది? ప్రధాని కాన్వాయ్ ఎలాంటి సెక్యూరిటీ మధ్య నడుస్తుందో క్లియర్‌గా తెలుసుకుందాం.
ప్రధాని కాన్వాయ్‌లలో అత్యాధునిక వాహనాలు ఉంటాయి. అన్నింటిలో మొదటిది సెక్యూరిటీ కార్.. ఆ తర్వాత అడ్వాన్స్ పైలట్ కార్. ఆపై డైరెక్ట్ సెక్యూరిటీ కార్ ఉంటుంది. ప్రధాని కూర్చునే వాహనాల్లో రెండు ఆర్మర్డ్ BMW 7 సిరీస్ సెడాన్‌లు, ఆరు BMW X5 లు, ఓ మెర్సిడెస్-బెంజ్ అంబులెన్స్‌తో పాటు మరో డజను వాహనాలు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. బుల్లెట్ల వర్షం కురిసినా.. బాంబు పేలుళ్లు జరిగినా తట్టుకునేలా ఉంటాయి.
ప్రధాని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ముందుగా సెక్యూరిటీ బాధ్యతలు చూస్తుంది. రెండో సర్కిల్ పర్సనల్ గార్డులు.. మూడో సర్కిల్ NSG కమాండోలు ఉంటారు. వీళ్లు ఏ ఆపదలోనైనా సులువుగా రక్షిస్తారు. నాలుగో సర్కిల్ పారామిలటరీ దళం. ఇందులో కఠినమైన శిక్షణ పొందిన వివిధ పారామిలిటరీ బలగాలకు చెందిన అత్యుత్తమ సైనికులు ఉంటారు. ప్రధాని వెళ్లే రాష్ట్రానికి చెందిన పోలీసులు ఐదో సర్కిల్‌కు సెక్యూరిటీ బాధ్యత నిర్వహిస్తారు.
బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలలో.. ప్రధాని జనసమూహానికి దగ్గరగా వెళ్లే సమయంలో మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలు ఉంటాయి. అప్పుడు పోలీసులతో పాటు, ఇతర భద్రతా సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. కొంతమంది మఫ్టీలో ఉంటారు. రాజకీయ కార్యక్రమాలలో ప్రధాని కూడా ప్రోటోకాల్ నుంచి తప్పుకునేలా.. ఆయన భద్రతా సిబ్బందిపై ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయాల్లో SPG ఒక స్టాండ్ తీసుకోవలసి ఉంటుంది. అక్కడ అందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోతే.. కచ్చితంగా ప్రధానికైనా సరే నో చెప్పాల్సి వస్తుంది.
భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ సమావేశంలో ప్రధాని విమానంలో వస్తారా? రోడ్డు లేదంటే రైలు మార్గంలో వస్తారా అన్న విషయాలతో పాటు.. ఆయన పాల్గొనే కార్యక్రమానికి ఎలా చేరుకుంటారో కూడా చర్చిస్తారు. టూర్‌కి సంబంధించి ప్లాన్ చేయడంలో కేంద్ర ఏజెన్సీలు, లోకల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్‌పుట్‌లను పరిగణనలోకి తీసుకుంటాయి. సభ, సమావేశ వేదిక భద్రతతో పాటు అక్కడి నుంచి ఎలా.. ఎటువైపు నుంచి వెళ్లడం కూడా ముందుగానే ప్లాన్ చేస్తారు.
ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతను ప్లాన్ చేయడంలో కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటాయి. కొన్ని రోజుల ముందు నుంచే ఎక్సర్‌సైజ్ చేస్తాయి. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు.. ఈవెంట్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరినీ స్కాన్ చేస్తారు. సంబంధిత రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు, జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమవుతుంది. ప్రధాని టూర్‌కి సంబంధించి.. అవసరమైన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు చర్చలు జరుపుతారు. సమావేశం ముగిసిన తర్వాత నివేదిక తయారుచేస్తారు. దానిపై సమావేశానికి హాజరైన వాళ్లంతా సంతకం చేయాల్సి ఉంటుంది. నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ఏర్పాట్లు సక్రమంగా జరిగాయని తెలుస్తుంది.
వేదిక దగ్గరకు వచ్చే వారిని తనిఖీ చేయడంతో పాటు డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఎక్కడ ఉంచాలి అన్న విషయాలను కూడా చర్చిస్తారు. వేదిక పటిష్టత ఎలా ఉందీ అన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. స్టేజ్‌కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ, ఆ రోజు వాతావరణ నివేదికను కూడా పరిశీలిస్తారు. ప్రధాని ప్రయాణించే రూట్‌లో పొదలు ఉంటే, వాటిని తొలగిస్తారు. ప్రయాణ మార్గం ఇరుకుగా ఉంటే అప్పటికప్పుడు వాటిని వెడల్పు చేయిస్తారు. ఇలా ప్రతీ దశలోనూ ప్రధాని టూర్‌లో ప్రోటోకాల్‌తో పాటు పకడ్బందీగా భద్రతా వ్యవస్థ ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..