River-linking in south India: మంగళవారం కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశంలో ఐదు నదుల అనుసంధానం ప్రాజెక్టులను ప్రతిపాదించారు. ఐదు ప్రాజెక్టులలో మూడు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో నదుల అనుసంధానానికి సంబంధించినవి. వీటికి సంబంధించి డీపీఆర్‌లు(ముసాయిదా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు) ఖరారయ్యాయని, అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టులు గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా, పెన్నా-కావేరి నదులు.
ఫిబ్రవరి 2020లో, అప్పటి జలశక్తి మంత్రిత్వ శాఖ గోదావరి, కృష్ణా, కావేరిలను కలిపే డీపీఆర్ ముసాయిదా సిద్ధంగా ఉందని పేర్కొంది. గోదావరి నుంచి 247 టీఎంసీల నీటిని కృష్ణా, పెన్నార్, కావేరి బేసిన్‌లోని దక్షిణ ప్రాంతాలకు మళ్లించవచ్చని ముసాయిదా నివేదిక పేర్కొంది. వాస్తవానికి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కొత్తదేం కాదు. అనేక దశాబ్దాలుగా ఈ అంశం పరిశీలనలో. సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగుతోంది.
నాలుగు దక్షిణాది రాష్ట్రాల నదుల అనుసంధాన ప్రాజెక్టుల వివరణాత్మక సమాచారం మీకోసం..
గోదావరి-కృష్ణా
భారతదేశంలో మూడవ అతిపెద్ద నది అయిన గోదావరి మహారాష్ట్రలోని నాసిక్‌లో పుట్టింది. ఈ నది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ప్రవహిస్తుంది. ఇక దేశంలో నాల్గవ అతిపెద్ద నది కృష్ణా. ఇది కూడా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో పుట్టింది. అలా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే, ఏటా భారీ వరదలు వచ్చే గోదావరిని, నీటి ప్రవాహం సరిగా లేన కృష్ణా నదిని అనుసంధానం చేయాలనే ప్రతిపాదన 1970ల నుంచి ఉంది.
2016 సంవత్సరంలో రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు నదులను అనుసంధానం చేయడంతో దశాబ్దాల నాటి సమస్య మళ్లీ పురుడుపోసుకుంది.
నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ద్వీపకల్ప నదుల అనుసంధానం సాధ్యాసాధ్యాల నివేదిక ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ మహానది బేసిన్, గోదావరి బేసిన్‌ల మిగులు జలాలను కృష్ణా, పెన్నార్, కావేరి బేసిన్‌లకు మళ్లించడం లక్ష్యంగా పేర్కొంది. ముఖ్యంగా మహానది, గోదావరి నుండి మిగులు జలాలను మూడు లింక్‌లు ద్వారా అంటే ఇచ్చంపల్లి – నాగార్జున సాగర్, ఇచ్చంపల్లి-పులిచింతల, పోలవరం-విజయవాడ ద్వారా కృష్ణాకు మళ్లించాలనేది ప్రణాళిక.
కృష్ణ-పెన్నా..
పెన్నా నది చిక్కబళ్లాపురలోని నంది కొండలలో పుట్టి.. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహిస్తుంది. ఇది 597 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే, కృష్ణా – పెన్నా నది అనుసంధానం అనేది.. మహానది – గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి నదుల అనుసంధాన వ్యవస్థలో ఒక భాగం. అధికారిక నివేదిక ప్రకారం.. ఈ నదుల అనుసంధానాని మూడు లింక్‌లు ప్రతిపాదించారు. కృష్ణా (ఆల్మట్టి) – పెన్నా, కృష్ణా (శ్రీశైలం) – పెన్నా, కృష్ణా (నాగార్జునసాగర్) – పెన్నా (సోమశిల). కృష్ణా (ఆల్మట్టి) – పెన్నా లింక్ కృష్ణా, పెన్నా బేసిన్ ఆవల వినియోగం కోసం కృష్ణా నుంచి 1980 MM3(మైక్రో లీటర్) చొప్పున జలాలను మళ్లించడానికి ప్రతిపాదించారు. ఆల్మట్టి డ్యాం కుడి కాలువ నుండి 587.175 కి.మీ పొడవైన లింక్ కెనాల్‌తో కర్ణాటకలోని బాగల్‌కోట్, విజయపుర, కొప్పల్, బళ్లారి, రాయచూర్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల గుండా వెళుతుంది. చివరకు పెన్నా నదికి ఉపనది అయిన మద్దిలేరు నదిలో కలుస్తుంది.
పెన్నా-కావేరి..
పెన్నా నుండి, కావేరి నది దిగువన తమిళనాడులోని గుండార్ బేసిన్ వరకు ఉన్న ప్రాంతాల నీటి డిమాండ్లను తీర్చడానికి సోమశిల – గ్రాండ్ అనికట్ లింక్, దక్షిణ కావేరి – వైగై – గుండార్ లింక్ కెనాల్ ద్వారా కావేరి నది వైపు నీటిని మళ్లించాలని ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై నిర్మించిన సోమశిల డ్యామ్ నుండి 8,565 MM3 సామర్థ్యంతో నీటిని మళ్లించాలని ప్రతిపాదించారు. ఈ లింక్ కెనాల్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 4,91,200 హెక్టార్ల విస్తీర్ణానికి సాగునీటిని అందిస్తుంది. తమిళనాడు, పుదుచ్చేరిలోని తిరువళ్లూరు, కాంచీపురం, వెల్లూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు జిల్లాలకు కూడా నీరు అందుతుంది. సాగునీటి కోసం కాకుండా.. చెన్నై నగరానికి భవిష్యత్తులో గృహ మరియు పారిశ్రామిక నీటి అవసరాలకు నీటిని అందించడానికి కూడా ప్రతిపాదనలు చేశారు.
ప్రాజెక్టు అమలులో ఎందుకు జాప్యం..
నదుల అనుసంధానానికి సంబంధించి ప్రతిపాదనలు ఏళ్లుగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో జాప్యం జరుగుతోంది. నదీ ప్రవాహిస్తున్న రాష్ట్రాలు ఏవీ పొరుగు రాష్ట్రాలతో నీటిని పంచుకోవడానికి ఆసక్తి చూపకపోవడం కారణంగానే ఈ జాప్యం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. నీటి వాటాల్లో తమకే సింహ భాగం కావాలని రాష్ట్రాలు కోరుతుండటం వివాదాలకు దారి తీస్తోంది. నదుల అనుసంధానంపై తమిళనాడు మాదిరిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే.. కృష్ణా నీటి కేటాయింపులు ఇప్పటికీ ఖరారు కాకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. నీటి కేటాయింపులపై ఇరు రాష్ట్రాలు ఇంకా ఒక అంగీకారానికి రాకపోవడంతో కృష్ణా జలాల అంశం ఇంకా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉంది
కేంద్రం ప్రతిపాదనకు వ్యతిరేకత..
నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. అలాంటి ప్రతిపాదన చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విశేషాధికారం ఏంటని ప్రశ్నించారు. గోదావరి నదీ జలాలపై తెలుగు రాష్ట్రాలకు సర్వహక్కులు ఉన్నాయని బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఉందని, సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైన ట్రిబ్యునల్ తీర్పును మీరు ఎలా ఉల్లంఘిస్తారంటూ కేంద్రాన్ని నిలదీశారు సీఎం కేసీఆర్.
కేంద్రంపై తమిళనాడు ఒత్తిడి..
మరోవైపు.. నదుల అనుసంధానానికి సంబంధించి డీపీఆర్‌ను ఖరారు చేయాలని తమిళనాడు రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ ప్రాజెక్టుకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గతేడాది దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖ కూడా రాశారు.
మా డిమాండ్‌ను అంగీకరిస్తే ఓకే..
కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి గోవింద్ కర్జోల్ నదుల అనుసంధాన ప్రాజెక్టు అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రం కోరిన నీటి వాటాను పొందిన తరువాతే నదుల అనుసంధానానికి అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. “నదుల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదన కొత్తది కాదు, చాలా ఏళ్లుగా ఉంది. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును ఖరారు చేసే ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదించాలి, లేకుంటే అందులో పురోగతి ఉండదు. ఇది చాలా మంచి ప్రాజెక్టు. కానీ మా నీటి వాటాను మేం పొందాలి. డిమాండ్ చేసిన నీటి వాటాను కేటాయిస్తే, మేం ఈ డీపీఆర్‌ను అంగీకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ స్టాండ్ ఇప్పుడే చెప్పలేం. వివిధ సాంకేతిక అంశాలు ఉన్నాయి. ముసాయిదా DPR ను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఈ అంశంపై కేంద్రం మా అభిప్రాయాన్ని అడిగినప్పుడు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము స్పందిస్తాం.” అని కార్జోల్ పేర్కొన్నారు.
న్యాయబద్ధంగా జరిగితే ఓకే..
నీటి కేటాయింపులు న్యాయబద్ధంగా జరిగితేనే డీపీఆర్ డ్రాఫ్ట్‌కు అంగీకరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రాలు ముసాయిదాకు అంగీకరిస్తేనే డీపీఆర్ చేస్తామని కేంద్రం కూడా చెప్పింది. డీపీఆర్ ఖరారు చేసే ముందు రాష్ట్రానికి సరైన నీటి వాటా వచ్చేలా చూస్తాం. యూపీఏ ప్రభుత్వ హయాంలో నీటి కేటాయింపులు సరిగ్గా జరగలేదు. మాకు నీటి వాటా వచ్చే వరకు గట్టిగా పోరాడుతాం.’’ అని బొమ్మై విలేకరులతో అన్నారు.
విపక్షాల విమర్శలు..
నదుల అనుసంధానంపై కేంద్రం విధానాలను విమర్శించారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేష్. ‘‘మోదీ ప్రభుత్వం విధ్వంసక మార్గంలో పయనిస్తోంది.’’ అని ట్వి్ట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఆచరణ సాధ్యం కాదు.. నిపుణుల అభిప్రాయం..
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన నీటి నిపుణులు, ఇంజనీర్ హిమాన్షు ఠక్కర్ మాట్లాడుతూ.. , గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టును ‘నాన్-స్టార్టర్ ప్రాజెక్ట్’ గా అభివర్ణించారు. అంటే ఇది ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుగా పేర్కొన్నారు. “ఇది ఆచరణ సాధ్యం కాదు, గోదావరిలో మిగులు లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ కూడా అదే విషయాన్ని చెబుతోంది. బదిలీ చేయగల మిగులు జలాలు ఉన్నాయని అంగీకరించడానికి బేసిన్ రాష్ట్రాలు సిద్ధంగా లేనంత కాలం ఈ ప్రాజెక్ట్ నాన్-స్టార్టర్ గానే ఉంటుంది. మిగులు ఏ ప్రాతిపదికన నిర్ణయించారో మాకు కూడా తెలియదు. అయితే, ఈ నదుల భౌగోళిక స్వరూపాన్ని మార్చినప్పుడు వృక్షజాలం, జంతుజాలంకూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. దీని ప్రభావాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. అంతేకాదు.. నీరు అనేది చాలా ఎమోషనల్ ఇష్యూ. ఏ రాష్ట్రం మరో రాష్ట్రానికి నీరు ఇవ్వడానికి సిద్ధపడవు. అలాంటిది ఊహించలేం కూడా. ఒకేవేళ ప్రభుత్వాలు అలా చేస్తే.. వెంటనే విపక్షాలు వారిని టార్గెట్ చేస్తాయి. అందుకే ఇది నాన్- స్టార్టర్ ప్రాజెక్టు.’’ అని ఠక్కర్ వ్యాఖ్యానించారు.
Also Read:
Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు.. వారం రోజుల్లో ట్రయల్స్..
IND vs WI: అతను గొప్ప ప్రతిభా వంతుడు.. కానీ అతడితో ద్రవిడ్ కూర్చోని మాట్లాడాలి..