President Election 2022: భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. త్వరలో దేశానికి కొత్త రాష్ట్రపతిని దేశం ఎన్నుకోనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్రపతి పదవికి జూన్ 29 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికలకు జూలై 18 న ఓటింగ్ నిర్వహిస్తారు. జూలై 21న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి.
రాష్ట్రపతి ఎన్నికల తీరు ఎలా ఉంటుంది? ఎన్నికల్లో పోటీకి అర్హులెవరు? ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల మాదిరిగా ఎవరైనా పోటీ చేయొచ్చా? ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలాంటి షరతులు ఉంటాయి అనే అంశాలపై చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం రాష్ట్రపతి ఎన్నికల సరళి గురించి తెలుసుకుందాం.
ఎన్నికలు ఎప్పుడు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, రాష్ట్రపతి పదవికి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఎన్నికల చట్టం 1952లోని సెక్షన్ 4 సబ్-సెక్షన్ (3)లోని నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రపతి పదవీ కాలం ముగియనున్న అరవై రోజుల వ్యవధిలో ఏ రోజైనా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రాష్ట్రపతి పదవీకాలం ముగిసిన మరుసటి రోజే ఎన్నికైన రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించే విధంగా ఎన్నికల షెడ్యూల్ నిర్ణయించబడుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం, రాష్ట్రపతి పదవికి ఎన్నిక కూడా ఎన్నికల సంఘంచే నిర్వహించబడుతుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు పోటీ చేయవచ్చు?
ఆర్టికల్ 58 ప్రకారం, రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఒక వ్యక్తి భారత పౌరుడిగా ఉండాలి. ఆ వ్యక్తి వయస్సు కనీసం 35 సంవత్సరాలు ఉండాలి. లోక్‌సభ సభ్యునిగా పోటీ చేయానికి ఉండాల్సిన అర్హతలన్నీ తప్పనిసరిగా ఉండాలి. భారత ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయకమైన పదవిలో ఉండకూడదు. అంతే కాకుండా రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేయడానికి అనేక షరతులు పాటించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే.. సదరు అభ్యర్థికి కనీసం యాభై మంది ఎమ్మెల్యేలు, ఎంపీల మద్ధతు ఉండాలి. ఆ తరువాత నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ. 15,000 సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఒక ఎలక్టర్ ఒక అభ్యర్థి పేరును మాత్రమే ప్రతిపాదించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 ప్రకారం, రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. అదనంగా, తదుపరి వారసులు బాధ్యతలు స్వీకరించే వరకు కూడా పదవిలో కొనసాగవచ్చు. అంటే.. 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో పదవిలో ఉండొచ్చు. రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉండకూడదనే నిబంధన ఉంది.
ఓటు ఎవరు ఇస్తారు?
రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంత శాసనసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. ఇక శాసనసభకు, పార్లమెంట్‌కు నామినేట్ చేయబడిన సభ్యులఉ రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం లేదు.