గూఢచర్యం జరిపాడన్న ఆరోపణలపై 2016 మార్చిలో పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేసిన భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విధించాలన్న ఉత్తర్వులను పాకిస్తాన్ తప్పనిసరిగా సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయ స్థానం (ఐసీజే) ఇచ్చిన తీర్పు ఇండియాకు పెద్ద విజయమే.. అదే సమయంలో పాకిస్థాన్ కు ఈ కోర్టు ‘ మొట్టికాయ ‘ వేసినట్టుగా కూడా భావించాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాక్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని, అంతవరకు మరణశిక్షను నిలుపుదల చేయాలని ఐసీజే పేర్కొంది. ఆయనను అరెస్టు చేయడంద్వారా పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్నిఅతిక్రమించిందన్న భారత వాదనతో కోర్టు ఏకీభవించింది.
ఒక దోషిగా కుల్ భూషణ్ ను మీరు పేర్కొంటున్నారని, అయితే అతని హక్కులగురించి పాక్ ప్రస్తావించలేదని కోర్టు జడ్జి అబ్దుల్ ఖావీ అహ్మద్ యూసుఫ్ అన్నారు. (హేగ్ లో ఆయన తీర్పు ప్రకటించారు). కుల్ భూషణ్ కు సంబంధించిన సమాచారాన్ని, ఆయన హక్కులకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్ ఇండియాకు తెలియజేయలేదన్నారు. పైగా జాదవ్ అరెస్టు సమాచారాన్ని కూడా ఇండియాకు తెలపడంలో పాక్ మూడు వారాలు జాప్యం చేసిందన్నారు. కావాలనే ఇలా వ్యవహరించినట్టు కనబడుతోందన్నారు. ఈ తీర్పు నిచ్చిన 15 మంది న్యాయమూర్తుల్లో పాక్ కు చెందిన ఒక్క జడ్జి తప్ప మిగతావారంతా ఇండియాకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు. చైనా జడ్జికూడా ఇండియాకు సపోర్టు చేయడం విశేషం. ఈ కోర్టులో భారత్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. జాదవ్ అరెస్టు అక్రమమని, గూఢచర్యం చేయకున్నా.. చేసినట్టు ఆరోపించారని ఆయన అన్నారు. ఆయన వాదనలను కోర్టు సమర్థించింది.