Om Birla: చరిత్ర సృష్టించిన ఓం బిర్లా. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌‌గా చేసింది వీరే..!

|

Jun 26, 2024 | 1:02 PM

18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూజువాణి ఓటుతో విజయం సాధించారు. స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Om Birla: చరిత్ర సృష్టించిన ఓం బిర్లా. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌‌గా చేసింది వీరే..!
Om Birla
Follow us on

18వ లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. బుధవారం లోక్‌సభలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థిపై మూజువాణి ఓటుతో విజయం సాధించారు. స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఓం బిర్లా కోటా-బుండి లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ 2.0 ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈసారి కూడా NDA ఆయనను లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. NDAకి మెజారిటీ ఉంది. ఇతర పార్టీలు కూడా బయటి నుండి ఓం బిర్లాకు మద్దతు పలికారు. దీంతో ఓం బిర్లా రెండవసారి లోక్‌సభ స్పీక‌ర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఓం బిర్లా వరుసగా రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన రాజస్థాన్‌కు చెందిన బలరాం జాఖర్‌తో సమానంగా నిలిచి చరిత్ర సృష్టించారు.

ఇప్పటి వరకు లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండుసార్లు ఎన్నికై తన పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఏకైక లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జాఖర్ నిలిచారు. తెలుగు వారైన నీలం సంజీవరెడ్డి, GMC బాలయోగి వంటి అనుభవజ్ఞులైన నాయకులు, PA సంగ్మా కూడా రెండుసార్లు లోక్‌సభ స్పీకర్ అయినప్పటికీ 5 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. బలరామ్ జాఖర్ 1980 నుండి 1985 వరకు తిరిగి 1985 నుండి 1989 వరకు తన రెండు పర్యాయల పదవీకాలాన్ని పూర్తి చేశారు.

ఇక రెండు పర్యాయాలు లోక్‌సభ చేసిన వారిలో ఎం.ఏ.అయ్యంగార్ ప్రథముడు. స్వాతంత్ర భారత దేశంలో మొట్ట మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అయిన అయ్యంగార్, మార్చి 8, 1956 నుండి మే 10, 1957 వరకు స్పీకర్‌గా పనిచేశారు. ఆపై మళ్లీ మే 11, 1957 నుండి ఏప్రిల్ 16, 1962 వరకు ఎన్నికయ్యారు. లోక్‌సభ తొలి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మావలంకర్ మరణం తర్వాత అయ్యంగార్ తొలిసారి స్పీకర్ అయ్యారు. అయ్యంగార్ సభాపతిగా ఆమోదించిన మైలురాయి చట్టాలలో వరకట్న నిషేధ చట్టం ఒకటి. ఇక తర్వాత డాక్టర్ గుర్డియాల్ సింగ్ ధిల్లాన్ ఆగస్టు 8, 1969న మొదటిసారిగా లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు. మార్చి 17, 1971 వరకు ఆ స్థానంలో కొనసాగారు. స్పీకర్‌గా అతని రెండవ పదవీకాలం మార్చి 22, 1971న ప్రారంభమై డిసెంబర్ 1, 1975 వరకు కొనసాగింది.

ఓం బిర్లా విషయానికి వస్తే, ఇప్పటివరకు పోటీ చేసిన ఆరు ప్రధాన ఎన్నికల్లో అజేయంగా నిలిచారు. 2019లో బీజేపీ ఆయనను లోక్‌సభ స్పీకర్‌గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండోసారి ఎంపీ అయిన బిర్లా లోక్‌సభ స్పీకర్‌ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక మరోసారి ఓం బిర్లాను ఎన్డీయే అభ్యర్థిని చేసింది.

బలరామ్ జాఖర్ రికార్డును బద్దలు కొట్టనున్న బిర్లా!

రాజస్థాన్‌కు చెందిన బలరామ్ జాఖర్ వరుసగా రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన తొమ్మిదిన్నరేళ్లకు పైగా లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. మొదటి పదవీకాలం 22 జనవరి 1980 నుండి 15 జనవరి 1985 వరకు పూర్తి చేశారు. దీని తరువాత, మళ్లీ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 16 జనవరి 1985 నుండి 18 డిసెంబర్ 1989 వరకు స్పీకర్‌గా కొనసాగారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఇక అంతకు ముందు తెలుగు వారైన నీలం సంజీవ్ రెడ్డి, జీఎంసీ బాలయోగి కూడా రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసినప్పటికీ, పదవీ కాలానికి మధ్య కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అయితే ఓం బిర్లా గత 5 సంవత్సరాలుగా లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. తాజాగా మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. దీంతో బలరామ్ జాఖర్ రికార్డును బ్రేక్ చేశారు.

ఓం బిర్లా పాఠశాల దశ నుండే రాజకీయాలను ప్రారంభించారు. 1978-79లో మల్టీపర్పస్ స్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. దీని తర్వాత, కామర్స్ కాలేజీలో విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బిర్లా, 1987 నుండి 1991 వరకు భారతీయ జనతా యువ మోర్చా కోట అధ్యక్షుడిగా ఉన్నారు. 1987 నుండి 1995 వరకు అతను కోటా కో-ఆపరేటివ్ కన్స్యూమర్ హోల్‌సేల్ భండార్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. 1993 నుండి 1997 వరకు BJYM రాష్ట్ర అధ్యక్షుడిగా, 1997 నుండి 2003 వరకు జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.

మూడుసార్లు ఎంపీగా ఓం బిర్లా విజయం:

ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా-బండి లోక్‌సభ స్థానం నుంచి ఆయన మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. బీజేపీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ప్రహ్లాద్ గుంజన్‌పై 41,974 ఓట్ల తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కంచుకోటగా భావించే కోటా ఎన్నికల నియోజకవర్గంలో బీజేపీ మళ్లీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పట్టం కట్టింది. కోటాలో వైద్య దావూడియాల్ జోషి తర్వాత మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలిచిన తొలి నాయకుడు కావడం విశేషం.

ఓం బిర్లా రాజకీయ జీవితం?

2003 నుంచి ఓం బిర్లా ఏ ఎన్నికల్లోనూ ఓడిపోలేదు. 2003లో తొలిసారిగా కోటాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2008లో కోటా సౌత్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత శాంతి ధరివాల్‌పై విజయం సాధించారు. 2013లో కోటా సౌత్ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు. 2014లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019, 2024లో విజయమే రుచి చూశారు. 2019లో బీజేపీ ఆయనను స్పీకర్‌గా చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం లేకపోయినా ఓం బిర్లా సభను నడిపిన తీరు ప్రశంసనీయం. ఈ క్రమంలోనే ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా రెండవసారి ఎన్నికయ్యారు. ఓం బిర్లా కొత్త, పాత పార్లమెంటు భవనాల్లో పనిచేసిన రికార్డు ఉన్న మొదటి లోక్‌సభ స్పీకర్.

ఓం బిర్లా వ్యక్తిగత జీవితం:

ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. అతని తండ్రి పేరు శ్రీకృష్ణ బిర్లా, తల్లి పేరు శకుంతలా దేవి. మార్చి 11, 1991న అతను డాక్టర్ అమితా బిర్లాను వివాహం చేసుకున్నారు. వీరికి ఆకాంక్ష, అంజలి బిర్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఓం బిర్లా విద్యాభ్యాసం విషయానికి వస్తే, అతను 1986లో మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుండి M.Com పూర్తి చేశారు. బిర్లా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి శ్రీ కృష్ణ బిర్లా రాష్ట్ర పన్ను శాఖలో ప్రభుత్వ ఉద్యోగి. తల్లి శకుంతలా దేవి గృహిణి. బిర్లాకు 6 మంది సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతని ఇద్దరు అన్నలు రాజేష్ కృష్ణ బిర్లా, హరికృష్ణ బిర్లా సహకార బోర్డు ఛైర్మన్‌గా పని చేశారు. బిర్లా భార్య అమిత బిర్లా వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యురాలు. అతని పెద్ద కుమార్తె ఆకాంక్ష వివాహం చేసుకుంది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా కొనసాగుతున్నారు. చిన్న కూతురు అంజలి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో ఉన్నారు.

తాజాగా మూజువాణీ ఓటింగ్ ద్వారా ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ వెంట రాగా.. ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు మోదీ, రాహుల్‌ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..