Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ దారుణ హత్య.. బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు

|

Oct 13, 2024 | 12:22 PM

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (66) శ‌నివారం రాత్రి దారుణ హ‌త్యకు గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలో సిద్ధిఖీపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనలో సిద్ధిఖీ కడుపు, ఛాతిపై బుల్లెట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ..

Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ దారుణ హత్య.. బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు
Baba Siddique
Follow us on

ముంబై, అక్టోబర్‌ 13: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (66) శ‌నివారం రాత్రి దారుణ హ‌త్యకు గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలో సిద్ధిఖీపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనలో సిద్ధిఖీ కడుపు, ఛాతిపై బుల్లెట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాంద్రాలో తన కుమారుని కార్యాలయంలో ఉన్న సమయంలో సిద్ధిఖీపై దాడి జరిగింది. బాంద్రా ఈస్ట్‌లోని ఆయన కుమారుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సిద్ధిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11.27 గంటలకు సిద్ధిఖీ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కాల్పుల‌కు పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ అని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వ‌ర‌కు బిష్ణోయ్ గ్యాంగ్ ఎలాంటి అధికారిక ప్రక‌ట‌న చేయ‌లేదు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ ప్రస్తుతం గుజ‌రాత్‌లోని స‌బ‌ర్మతి జైల్లో ఉన్నారు.

సిద్ధిఖీపై కాల్పులు జ‌రిపిన ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అరెస్ట్‌ చేసిన నిందితులును క‌ర్నైల్ సింగ్ (హ‌ర్యానా), ధ‌రమ్ రాజ్ క‌శ్యప్ (ఉత్తర‌ప్రదేశ్‌) గా గుర్తించారు. ఇంకొక‌రు పరారీలో ఉన్నారు. అత‌న్ని ప‌ట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చ‌ర్యలు చేపట్టారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల‌ విచార‌ణ‌లో షాకింగ్‌ విషాలు వెలుగులోకి వచ్చియా. సిద్ధిఖీ హ‌త్యకు గ‌త నెల రోజుల నుంచి మాటు వేసినట్లు విచారణలో తేలింది. బాంద్రాలోని ఆయ‌న కుమారుడి ఇంటి వ‌ద్ద దుండ‌గులు పలుమార్లు రెక్కీ నిర్వహించిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందంటే..

శనివారం నాడు బాంద్రాకు ముగ్గురు దుండ‌గులు సాయుధాలతో ఆటోలో వ‌చ్చారు. వారు సిద్దిఖీ కుమారుడి ఇంటి ముందు వాహనంలో వేచి ఉన్నారు. కొంత సమయం తర్వాత బయటకు వచ్చిన సిద్ధిఖీ.. దసరా సందర్భంగా బాణాసంచా పేలుస్తుండగా, వాహనంలో నుంచి ముగ్గురు వ్యక్తులు ముసుగులు కప్పుకుని బయటకు వచ్చారు. సిద్ధిఖీ రాగానే మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. సిద్ధిఖీ క‌ద‌లిక‌ల‌పై దుండ‌గుల‌కు సమాచారం అందిచడానికి మరో వ్యక్తి సహాయం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవ‌రనే దానిపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అలాగే సిద్ధిఖీ హ‌త్యలో బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఎంతమేర ఉందనే కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇక సిద్ధిఖీ మరణానికి ముందు15 రోజుల క్రితం తనకు ప్రాణహాని ఉందని, త‌న‌కు వై కేట‌గిరీ భ‌ద్రత కేటాయించాల‌ని పోలీసు ఉన్నతాధికారుల‌ను కోరిన‌ట్లు సిద్ధిఖీ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో మాజీ మంత్రి సిద్ధిఖీపై బహిరంగంగా కాల్పులు జరపడంతో శాంతిభద్రతలను కాపాడటంలో అధికార ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.