Mulayam Singh Yadav: ఆందోళనకరంగా ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి.. వాకబు చేసిన సీఎం కేసీఆర్..

|

Oct 03, 2022 | 4:21 PM

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Mulayam Singh Yadav: ఆందోళనకరంగా ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి.. వాకబు చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr Mulayam Singh Yadav
Follow us on

ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన్ను హుటాహుటినా గుర్‌గ్రామ్‌ మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉందని మేదాంత ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో ఉన్నారని.. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తుందని సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం కొద్దిరోజుల నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ముందు ఐసీయూ.. ఆ తర్వాత సీసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 82 ఏళ్ల SP అధినేత ప్రస్తుతం లోక్‌సభలో మెయిన్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్‌లతో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యంపై మేదాంత హాస్పిటల్ విడుదల చేసిన ప్రకటన కాపీని షేర్ చేసింది.. నేతాజీ గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లోని ‘క్రిటికల్ కేర్ యూనిట్’లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. పరిస్థితి నిలకడగా ఉందని.. దయచేసి నేతాజీని కలిసేందుకు ఆసుపత్రికి రావద్దంటూ విన్నవించింది. నేతాజీ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని పేర్కొంది. ములాయం తనయుడు , సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాని మోడీ, సీఎం యోగి పరామర్శ..

ఇవి కూడా చదవండి

కాగా.. ములాయం ఆరోగ్య పరిస్థితపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడి తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అఖిలేష్ యాదవ్‌తో మాట్లాడారు. ములాయంకు ఉత్తమ చికిత్స అందించాలని ఆసుపత్రి యజామన్యానికి ఆదేశించారు.

అఖిలేశ్ యాదవ్ కు సీఎం కేసీఆర్ ఫోన్

అనారోగ్యానికి గురై ఐసియు లో చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత, ఎంపీ ములాయమ్ సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కూడా ఆరా తీసారు. ములాయం సింగ్ కుమారుడు అఖిలేశ్ యాదవ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..