Monkeypox: మంకీపాక్స్‌తో కరోనా స్థాయిలో ముప్పు ఉందా?

|

Sep 11, 2024 | 8:13 AM

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న మరో మహమ్మారి.. దీన్ని మహమ్మారి అనొచ్చా.. లేక మామూలు వ్యాధిగానే పరిగణించాలా అనే స్పష్టతైతే లేదు. ఇది విజృంభించే పరిస్థితులున్నాయా లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతానికి ఆఫ్రికా, యూరోపియన్ దేశాల్ని కబళిస్తున్న మంకీపాక్స్ గురించే మనం చెప్పుకుంటున్నాం. ఇండియాలో ఈ వైరస్‌కున్న ఫ్యూచరేంటి.. మన ఫ్యూచర్లను ప్రభావితం చేసేంత సత్తా దీనికి ఉందా లేదా..? తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య యంత్రాంగం అప్రమత్తత ఏమాత్రం?

Monkeypox: మంకీపాక్స్‌తో కరోనా స్థాయిలో ముప్పు ఉందా?
Monkeypox
Follow us on

మంకీపాక్స్… ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో మొదటిసారిగా కనిపించింది. తర్వాత యూరోపియన్ కంట్రీస్‌కి పాకింది. పాకిస్తాన్‌లో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి. మార్చి మూడో వారంలో మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇండియాని వణికిస్తోంది. మంకీపాక్స్ లక్షణాల్ని, దాంతో కలిగే డ్యామేజ్‌నీ బట్టి కోవిడ్‌తో పోలిక పెట్టడం అలవాటుగా మారింది మనోళ్లకు. కానీ.. కరోనా అంతటి ప్రమాదకరం కాదని ప్రభుత్వం నుంచి క్లారిటీ ఉంది.

ఇటీవలే హర్యానాలో ఒక యువకుడికి లక్షణాలుంటే మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ ఐంది. ఢిల్లీలో మరో ఇద్దరికి మంకీపాక్స్ సంకేతాలున్నట్టు గ్రహించి.. వీళ్లను ఐసొలేషన్‌లో ఉంచారు. పరీక్షల తర్వాత ఇది వెస్ట్-ఆఫ్రికన్ క్లేడ్‌-2 మంకీపాక్స్ వైరస్‌గా గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన క్లేడ్‌-1 రకం వైరస్‌ కాదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చింది. పైగా క్లేడ్ -2 వైరస్ కొత్త రకం వేరియంట్ కాదు. గత రెండేళ్లలో దేశంలో ఇటువంటివి 30 దాకా నమోదయ్యాయి. ఇప్పుడు వైరస్ సోకిన వాళ్లు విదేశాలకు వెళ్లి అక్కడే మంకీపాక్స్ సోకిన తర్వాత ఇండియాకు వచ్చారు. సో.. ఈ కేసు ఇక్కడ పుట్టింది కాదన్నమాట.

ప్రాధమికంగా మొలకెత్తిన అసలు వైరస్ ఒక్కటే ఉంటుంది. దాన్నుంచి అనేక రకాల వేరియంట్లు పుడుతుంటాయి. వీటన్నిటికీ మూల వైరస్‌కున్నంత తీవ్రత ఉండే అవకాశం లేదు. అందుకే.. క్లేడ్‌-2 రకాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదంటోంది కేంద్రం. మంకీపాక్స్‌ పీడిత దేశాల్లో పబ్లిక్‌ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినంత మాత్రాన.. మన దేశంలో కూడా అటువంటి అత్యవసర పరిస్థితి ఉందని చెప్పలేం.

కోవిడ్ నాటి చేదు అనుభవం ఉంది కనుక.. ముందుజాగ్రత్తగా హెచ్చరికలు జారీ చేయడం అలవాటుగా మారింది కేంద్రానికి. వైరస్ నియంత్రణపై వైద్యుల్లో అవగాహన పెంచాలని, నిర్ధారణ పరీక్షల విషయంలో అప్‌డేట్ కావాలని ఇప్పుడు కూడా గైడ్‌లైన్స్ పంపింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శాఖ ఈ దిశగా ఎటెన్షన్‌లోకొచ్చింది. మంకీపాక్స్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. నియంత్రణ చర్యలు తీసుకుంది. ప్రత్యేక వార్డులు, టెస్టింగ్ కిట్లు, మెడిసిన్.. అన్నీ అందుబాటులో ఉంచుకుంది.

కరోనా వైరస్‌ తుమ్మినా, దగ్గినా.. గాలి ద్వారా ఇతరులకు చేరుతుంది. ఎమ్‌పాక్స్ వైరస్ కోవిడ్‌లాంటిది కాదు. స్పర్శ ద్వారా మాత్రమే మనిషి నుంచి మనిషికి సోకుతుంది. రోగి వాడిన దుస్తుల నుంచి, వస్తువుల నుంచి సోకే గుణం మంకీపాక్స్‌కి లేదు. ఇప్పటికే మంకీపాక్స్‌ నివారణకు వ్యాక్సిన్ ఉంది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంకో టీకా సిద్దమౌతోంది. అనుమానముంటే చాలు.. లక్షణాలు కనిపించక ముందే ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇప్పటికే విషజ్వరాలు టెర్రర్ పుట్టిస్తున్న సీజన్ కనుక.. మంకీపాక్స్ విషయంలో అప్రమత్తత తప్పదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే.. మంకీపాక్స్ లక్షణాలు కనిపించీ కనిపించనట్టు లోలోపలే ఉంటాయట.

వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కానప్పటికీ.. ఛాన్స్ ఇవ్వొద్దనేది ప్రభుత్వ ఆలోచన. మంకీపాక్స్ కేసులు పెరక్కుండా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల ద్వారా దేశంలోకి ప్రవేశించే వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టింది. మంకీపాక్స్‌ వైరస్‌ను గుర్తించేందుకు దేశంలో 32 స్పెషల్ లాబ్స్‌, ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి