మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి అక్కడ అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈవీఎంల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఈవీఎంలపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణను రద్దు చేసి.. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 288 మంది సభ్యులతో కూడిన మహారాష్ట్ర అసెంబ్లీలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేవలం 10 స్థానాల్లో గెలిచింది.
షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో నిర్వహించిన యాంటి – ఈవీఎం కార్యక్రమంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరత్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని.. ఎక్కడో ఏదో జరిగిందని ప్రజల మనసులో అనుమానం ఉందన్నారు. అమెరికా, ఇంగ్లండ్ సహా పలు సంపన్న దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. మరి భారత్‌లో ఈవీఎంలు ఎందుకని ప్రశ్నించారు. దేశ ప్రజలు కూడా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారని చెప్పారు. వెంటనే ఎన్నికల విధానాన్ని సంస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ఫిర్యాదులున్నా వాటిని తమకు అందజేయాలని శరద్ పవార్ కోరారు. వాటిని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపుతామని చెప్పారు.
యాంటి ఈవీఎం కార్యక్రమంలో శరద్ పవార్
Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, “Elections happen…some win some lose…but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU
— ANI (@ANI) December 8, 2024
కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తంచేస్తూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు తమ ఓటమిని అంగీకరించి.. దీనికి కారణమేంటో ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదన్నారు.
ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముందుగా ప్రతిపక్షాలు ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించాలని అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదన్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.