కాలుష్యానికి వర్షం విరుగుడు.. దేశ రాజధానిలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. మేఘ మథనం సాధ్యపడేనా?

| Edited By: Janardhan Veluru

Nov 09, 2023 | 2:51 PM

క్లౌడ్ సీడింగ్ విధానంలో మేఘాలను మథించడం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపిస్తారన్న విషయం తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు వర్షాలు కురిపించడం కోసం అప్పట్లో 'మేఘ మథనం' నిర్వహించారు. తద్వారా పంటలకు నీరు అందించాలన్న ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వాయు కాలుష్యం స్థాయులను తగ్గించడం కోసం మేఘ మథనం చేపట్టాలని భావిస్తోంది.

కాలుష్యానికి వర్షం విరుగుడు.. దేశ రాజధానిలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. మేఘ మథనం సాధ్యపడేనా?
Artificial Rain
Follow us on

అత్యంత తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధానికి ఉపశమనం కల్గించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు తోడు మానవ తప్పిదాలతో ఏర్పడుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మానవ ప్రయత్నంతో కృత్రిమంగా వర్షం కురిపించాలని భావిస్తోంది. క్లౌడ్ సీడింగ్ విధానంలో మేఘాలను మథించడం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపిస్తారన్న విషయం తెలుగు ప్రజలకు తెలిసిన విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు వర్షాలు కురిపించడం కోసం అప్పట్లో ‘మేఘ మథనం’ నిర్వహించారు. తద్వారా పంటలకు నీరు అందించాలన్న ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం వాయు కాలుష్యం స్థాయులను తగ్గించడం కోసం మేఘ మథనం చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), కాన్పూర్‌తో కలిసి కసరత్తు చేస్తోంది. మరి ఢిల్లీ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యం నెరవేరేనా? క్లౌడ్ సీడింగ్ ఎంతమేర సత్ఫలితాలనిస్తుంది? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

వర్షంతో కాలుష్యానికి చెక్

ఢిల్లీలో వాయుకాలుష్యానికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. అందులో కొన్ని భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కారణమైతే, మరికొన్ని మానవ తప్పిదాలున్నాయి. రుతుపవనాల తిరోగమనం తర్వాత ఉత్తరాదిన వర్షాలు, గాలులు పూర్తిగా తగ్గిపోతాయి. శీతాకాలం ప్రవేశించడంతో పొగమంచు వాతావరణం ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితుల్లో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, వాహనాల రాకపోకల కారణంగా వెలువడే దుమ్ము, ధూళి, ఫ్యాక్టరీలు, భవన నిర్మాణాల నుంచి వెలువడే ధూళి వాతావరణం పైపొరల్లోకి చేరుతుంది. గాలులు, వర్షాల కారణంగా అది గాల్లో కలిసిన సూక్ష్మాతి సూక్ష కాలుష్య రేణువులు వర్షపు నీటి బిందువులకు అతుక్కుని తిరిగి భూమ్మీదకే చేరుకుంటాయి. వర్షం కారణంగా అలా వాయు కాలుష్యం తగ్గుతుంది. అయితే శీతాకాలంలో స్తబ్దుగా మారిన వాతావరణానికి తోడు పొగమంచు తోడవడం వల్ల భూమ్మీద నుంచి వెలువడే వాయుకాలుష్య ఉద్గారాలు ఉపరితలంలోకి వెళ్లకుండా అక్కడే నిలిచిపోతున్నాయి. దీనికి తోడు పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ‘ఖరీఫ్’ సీజన్ ముగించి ‘రబీ’ సాగు కోసం భూమిని సిద్ధం చేయడం కోసం పంట వ్యర్థాలను తగులబెడుతున్నారు. ఈ పొగ అంతా ఉత్తరాదిన పరచుకుని నిలిచిపోతోంది. దాంతో ఢిల్లీ వంటి ఉత్తరాది నగరాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. శీతాకాలంలో ఎప్పుడైనా వర్షం కురిస్తే అప్పటి వరకు ఉన్న వాయుకాలుష్యం ఒక్కసారిగా తగ్గి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మెరుగుపడుతుంది. కానీ ఈ వర్షం మనం కోరుకున్నప్పుడు కురిసేది కాదు కదా.. అందుకే కృత్రిమ వర్షం కోసం ఈ ప్రయత్నం.

కృత్రిమ వర్షం ఎలా సాధ్యం?

ఏ ప్రాంతంలోనైనా కృత్రిమ వర్షం కురిపించాలంటే ముందుగా పౌడర్ రూపంలో ఉన్న ‘సిల్వర్ అయోడైడ్‌’ను విమానం సహాయంతో ఆకాశంలో స్ప్రే చేయాల్సి ఉంటుంది. అది మేఘాలకు తగిలి అందులో ఉన్న తేమను నీటి బిందువులుగా మార్చేస్తుంది. దాంతో వర్షం కురుస్తుంది. సాధారణ భాషలో దీనిని ‘క్లౌడ్ సీడింగ్’ అంటారు. అయితే ఈ ప్రక్రియ చేపట్టడానికి కూడా ప్రకృతి సహకారం అవసరం. లేదంటే ఏడారి దేశాలు ఈ ప్రక్రియతో వర్షాలు కురిపించుకుని సస్యశ్యామలంగా మారేవి. క్లౌడ్ సీడింగ్ చేయాలంటే వాతావరణంలో కనీసం 40 శాతం మేఘాలుండాలి. అంతే కాదు, ఆ మేఘాల్లో తేమ కూడా ఉండాలి. అప్పుడే క్లౌడ్ సీడింగ్ ఫలించి కృత్రిమ వర్షాన్ని కురిపించగలదు. అయితే ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో కృత్రిమ వర్షం కురిపించడం కష్టమని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… శీతాకాలం ఇక్కడి వాతావరణంలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. చలితో కూడిన పొడి వాతావరణం ఉంటుంది. అందుకే ఈ ప్రయోగం ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలు పడదు. గతంలో 2018లో ఢిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేసింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వాతావరణం సహకరించకపోవడంతో ప్రయోగం సాధ్యపడలేదు.

మేఘ మథనానికి ముహూర్తం

ఈసారి నవంబర్ 20 లేదా 21 తేదీల్లో క్లౌడ్ సీడింగ్ జరపాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నిపుణులతో ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మరో మంత్రి అతీషి కూడా ఉన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతిరోజూ 400 పాయింట్ల కంటే ఎగువనే నమోదవుతోంది. ఒక్కోసారి AQI 500, 600 పాయింట్లు కూడా దాటుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విషపూరితమైన గాలి కారణంగా ప్రజలకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 మధ్య ఉంటే GRAP స్టేజ్-1, 301-400 మధ్య ఉంటే GRAP స్టేజ్-2, 401-450 ఉంటే GRAP స్టేజ్-3, 450పై నమోదైతే GRAP స్టేజ్-4 అమలు చేస్తారు. ఆ ప్రకారం భవన నిర్మాణ పనులపై నిషేధం, ఎక్కువ కాలుష్య ఉద్గారాలను వెదజల్లే పాత వాహనాలపై నిషేధం విధిస్తూ.. స్మాగ్ గన్స్, చెట్లపై నీటిని వెదజిమ్మడం వంటి చర్యలు చేపడుతూ ఉంటారు. కానీ అవేవీ కాలుష్యం స్థాయులను తగ్గించడం లేదు. అందుకే మేఘ మథనం నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఇందుకు సంబంధించిన తమ ప్రణాళికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని, అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థిస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్ట్ నుంచి ఆదేశాలు వస్తే.. IIT-కాన్పూర్ సహాయంతో నవంబర్ 20-21 నాటికి ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని చూస్తున్నట్టు తెలిపారు.

నవంబర్ 20-21 తేదీల్లో ఢిల్లీలో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి అంచనాలున్నాయి. వాతావరణంలోనూ కొంత మేర తేమ శాతం ఉంటుందని, అందుకే ఆ రెండు రోజుల్లో ఢిల్లీ గగనతలంపై క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా కృత్రిమ వర్షం కురిపించవచ్చని భావిస్తున్నారు. మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. వీలైనన్ని ఎక్కువ వనరులను ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్య ప్రభావాన్ని తగ్గించడమే తమ లక్ష్యం అని వెల్లడించారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చెప్పాలంటే నవంబర్ 20, 21 తేదీల వరకు ఆగాల్సిందే.