Woman letter to CM: రోడ్లు బాగోలేకపోవడంతో వారి గ్రామంలో పెళ్లిళ్లు కూడా జరగడంలేదు.. వారి ఊరికి రావాలంటేనే వేరే ఊరు వారు జంకుతున్నారంటే.. వారి పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించవచ్చు. ఇలాంటి క్రమంలో.. ఓ యువతి చేసిన ఓ పనితో అధికారుల్లో చలనం వచ్చింది. ఆమె నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది.. తమ గ్రామంలో రోడ్లు బాగోలేకపోవడంతో.. తమకు వివాహాలు జరగడం లేదంటూ ఆవేదన వెళ్లగక్కుకుంది. రోడ్లు బాగోలేక స్థానికులెవరికీ వివాహాలు జరగడం లేదని.. బాలికలు మధ్యలోనే చదువు మానేస్తున్నారంటూ కర్ణాటక సీఎం కార్యాలయానికి లేఖ పంపింది. ఈ సంఘటనతో అధికారుల్లో చలనం వచ్చింది.
కర్ణాటకలోని దవంగెరె జిల్లాలోని హెచ్ రాంపురా గ్రామంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన 26 ఏండ్ల ఉపాధ్యాయురాలు బిందు.. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు లేఖ రాసింది. తమ గ్రామానికి సరైన రోడ్ కనెక్టివిటీ లేదని.. అన్ని గ్రామాల కంటే.. ఈ గ్రామం వెనుకబడి ఉందని పేర్కొంది. ఈ సమస్య వల్ల గ్రామంలోని చాలా మందికి వివాహాలు కావడం లేదని తెలిపింది. గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల పిల్లలు చదువును నిలిపేస్తున్నారని.. దీంతో బయటి వ్యక్తులెవరూ పెళ్లి చేసుకోవడం లేదని తెలిపింది.
వంగెరె యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన బిందు టీచర్‌గా పనిచేస్తోంది. తమ గ్రామానికి రోడ్లు, బస్సు సర్వీసులు లేవని, ఈ కారణంగా హాస్టల్‌లో ఉంటున్నట్లు తెలిపింది. 300 మంది జనాభా ఉన్నప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదని.. విద్య, వైద్య కోసం గ్రామానికి 7-కి.మీ దూరంలో ఉన్న మాయకొండకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొంది. సాధ్యమైనంత త్వరలో తమ సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరింది.
ఇదిలాఉంటే.. బిందు లేఖపై కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పందించింది. ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తామని వెల్లడించింది. తక్షణమే పనులు చేపట్టాలని, జరుగుతున్న పనుల గురించి తెలియజేయాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను సీఎం కార్యాలయం ఆదేశించింది. అయితే.. గ్రామం అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసినట్లు మాయకొండ పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం సిద్దప్ప వెల్లడించారు. ఈ నిధులు సరిపోవని.. రూ.50లక్షల వరకు కావాలని వెల్లడించారు.
Also Read: