
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగానికి సిద్దమైంది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగం జరగనుంది. అయితే ఇస్రో ఈ ఏడాది ప్రయోగాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రతి ఏటా సగటున 5 నుంచి 7 ప్రయోగాలకు తక్కువ కాకుండా చేపడుతూ వస్తోంది ఇస్రో. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం ఒక్క ప్రయోగం మాత్రమే చేపట్టింది.. అది కూడా వైఫల్యం చెందింది.. ఇస్రో నిర్దేశించుకున్న ప్రయోగాలు అలాగే మిగిలి ఉన్నాయి.. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉండగా అనుకున్న లక్ష్యాలను అందుకుంటుందా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
గడిచిన దశాబ్దంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దూకుడు గా ఉంది.. చంద్రయాన్ సిరీస్ నుంచి మంగళ్యాన్, ఆదిత్య యాన్, సముద్రయాన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లను చేపట్టి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. త్వరలో ఇస్రో తొలి మ్యాన్ మిషన్ కోసం సిద్ధమవుతోంది. అలాగే భారత్ సొంతంగా నిర్మించ తలపెట్టిన ఇండియన్ స్పేస్ సెంటర్ ను కూడా త్వరలో చేపట్టనుంది.. ఇందు కోసం పనులు కూడా మొదలయ్యాయి.. వీటితో పాటు మన దేశ రక్షణ, వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు తరచూ ప్రయోగాలను చేపడుతూ వస్తోంది.. ఇక ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపుతూ తన సక్సెస్ రేట్ ను పెంచుకుంటూ వస్తోంది.. ఉన్నట్టుండి ఇస్రో స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి.. 2026 లో జరిగిన ప్రయోగాల సంఖ్య ఇందుకు ఉదాహరణ..
ఈ ఏడాది ఏడు ప్రయోగాలకు తక్కువ కాకుండా ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 12 న PSLV C 62 ప్రయోగం జరిగింది. అయితే ఆ ప్రయోగం విఫలం అయ్యింది. EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టాలన్న ఇస్రో ప్రయత్నాలు ఫలించలేదు. ఆతర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రయోగం కూడా జరగలేదు.. ఎనిమిది నెలల తర్వాత మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. సెప్టెంబర్ మొదటి వారంలో GSLV F17 రాకెట్ ప్రయోగం ద్వారా EOS M 5 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది ఇస్రో. భారత భూభాగంలో శతృ దేశాల కదలికలు, వాతావరణంలో అనూహ్యంగా వచ్చే మార్పులను గుర్తించడం కోసం ఈ శాటిలైట్ ఉపయోగ పడుతుంది..
ఈ ప్రయోగంతో రెండు ప్రయోగాలు మాత్రమే ఇస్రో పూర్తి చేస్తుంది.. అది కూడా తొలి ప్రయోగం విఫలం అయింది. ఇంకా మరో ఐదు ప్రయోగాలు కనీసం చేపట్టాల్సి ఉంది.. GSLV F18 , గగన్ యాన్ ప్రయోగం కోసం టెస్ట్ లాంచ్ ల కోసం మరో రెండు ప్రయోగాలు కూడా ఇందులో ఉన్నాయి.. ఇటీవల కాలంలో ఇస్రో శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండడం కూడా ఇస్రో ప్రయోగాల సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.. మరి ఇస్రో ఈ ఏడాది లక్ష్యాలను ఏ విధంగా పూర్తి చేస్తుందనేది చూడాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..