National Anthem: ‘జన గణ మన’ గీతాన్ని స్వతంత్ర భారత జాతీయ గీతంగా మన రాజ్యాంగ సభ 1950 జనవరి 24న స్వీకరించింది. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించారు. ఈ గీతం తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కోల్ కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఆలపించారు. వాస్తవానికి జన గణ మన గీతాన్ని ఠాగూర్ ఐదు చరణాలలో రచించారు. జాతీయ గీతంగా తొలి చరణాన్ని మాత్రమే స్వీకరించారు.
కాగా, జాతీయ గీతం పూర్తిగా 52 సెకండ్ల కాలవ్యవధిలో ఆలపించాలి. జాతీయ గీతాన్ని ఈ కింది ప్రభుత్వ కార్యక్రమాలలో, వివిధ సందర్భాలలో పూర్తిగా వినిపించాలి. సివిల్, మిలటరీ ఇన్ స్టిట్యూట్స్, రాష్ట్రపతి, గవర్నర్ కు గౌరవందనం సందర్భాల్లో ఆలపించాలి. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ వంటి ప్రముఖులు లేకున్నప్పటికీ పరేడ్ లలో ఆలపిస్తారు. రాష్ట్రప్రభుత్వ అధికార కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సందోహ కార్యక్రమాలకు రాష్ట్రపతి వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు, ఆకాశవాణిలో రాష్ట్రపతి జాతినుద్దేశించి చేసే ప్రంగానికి ముందు, వెనుక ఆలపిస్తారు.
రాష్ట్ర గవర్నర్ తన రాష్ట్ర పరిధిలో అధికారిక కార్యక్రమాలకు వచ్చినప్పుడు, నిష్ర్కమించేటప్పుడు, జాతీయ పతాకాన్ని పరేడ్ కు తెచ్చినప్పుడు, రెజిమెంటల్ కలర్స్ బహుకరించినప్పుడు, నౌకాదళంలో కలర్స్ ఆవిష్కరించినప్పుడు ఈ గీతాన్ని ఆలపిస్తారు. కొన్ని సందర్భాల్లో జాతీయ గీతాన్ని సంక్షిప్తంగా మొదటి, చివరి వరుసలను ఆలపించుకోవచ్చు. అలా ఆలపించడం 52 సెకండ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 1947లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జాతీయ గీతం గురించి భారత ప్రతినిధి బృందానికి అడిగినప్పుడు జన గణ మన రికార్డింగ్‌ను జనరల్‌అసెంబ్లీకి అందించారు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధుల ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. అయితే మన జాతీయ గీతాన్ని అన్ని దేశాలు ప్రశంసించారు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 1950 జనవరి 24న భారత రాజ్యాంగంపై సంతకం చేయడానికి అసెంబ్లీ సమాశమైంది. ఈ సమయంలో దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ అధికారికంగా జన గణ మన ను జాతీయ గీతంగా ప్రకటించారు.
జనగణమన అధినాయక జయహే!
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా!
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ!
ఉచ్చల జలధితరంగ!
తవశుభనామే జాగే! తవ శుభ ఆశిష మాగే!
గాహే తవ జయగాథా!
జనగణమంగళ దాయక జయహే!
భారత భాగ్య విధాతా!
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!