భవిష్యత్‌లో కాలుష్య రహిత దేశంగా భారత్.. గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్రం ఆమోదం.. వెల్లడించిన మంత్రి ఠాకూర్..

|

Jan 04, 2023 | 8:37 PM

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నిబంధనలకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

భవిష్యత్‌లో కాలుష్య రహిత దేశంగా భారత్.. గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్రం ఆమోదం.. వెల్లడించిన మంత్రి ఠాకూర్..
Union Minister Anurag Thakur
Follow us on

నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నిబంధనలకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించారు ఠాకూర్. ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం రూ.19,744 కోట్లు మంజూరు చేసిందని ప్రకటించారు. ఇందులో వ్యూహాత్మక ప్రాజెక్టులకు రూ.17,490 కోట్లు కేటాయించినట్లు ఠాకూర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కోసం రూ.1,466 కోట్లు వినియోగించనున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ డి కాంపోనెంట్ నుంచి రూ.800 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని మంత్రి వివరించారు.

గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణం..

కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు కేంద్రమంత్రి. ఈ మిషన్ కింద 2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందన్నారు. దేశంలో ఎలక్ట్రోలైజర్ తయారీకి కూడా ఐదేళ్లపాటు ప్రోత్సాహక మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి గతి శక్తి యోజన కింద మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మిషన్‌ను ఉపయోగించనున్నట్లు ఠాకూర్ తెలిపారు.

2021లో ఎర్రకోట వేదికగా ప్రకటించిన పీఎం మోదీ..

2021లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నేషనల్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ప్రత్యక్ష ప్రోత్సాహాన్ని అందించడం, గ్రీన్ ఎనర్జీ వనరుల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ మిషన్ లక్ష్యం అని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. హైడ్రోజన్ తయారీకి ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం జరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి

అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి..

గ్రీన్ హైడ్రోజన్‌ను క్లీన్ ఎనర్జీ అని కూడా పిలుస్తారు. సోలార్ పవర్ వంటి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ హైడ్రోజన్ అనేక పనులకు ఉపయోగించడం జరుగుతుంది. ఒక శక్తిగా ఇది పని చేస్తుంది. హైడ్రోజన్‌ను తయారు చేయడానికి ఉపయోగించే విద్యుత్తు పునరుత్పాదక ఇంధన వనరుల నుండి వస్తుంది. దీనివల్ల కాలుష్య ప్రభావం కూడా ఉండదు. అందుకే దీనిని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. చమురు శుద్ధి, ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి భారీ పరిశ్రమలను డీకార్బనైజ్ చేయడానికి ఇది సహాయపడుతుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నాు. ప్రపంచ కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలోనూ ఇది సహాయకారిగా ఉంటుందంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..