DMK MP Raja: అలా చేయకుంటే.. ప్రత్యేక దేశాన్ని కోరుతాం.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

|

Jul 04, 2022 | 6:48 PM

అన్ని రాష్ట్రాలతో కలిసి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలకు స్వంతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని డీఎంకే ఎంపీ రాజా పేర్కొన్నారు.

DMK MP Raja: అలా చేయకుంటే.. ప్రత్యేక దేశాన్ని కోరుతాం.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Mp Raja
Follow us on

DMK MP Raja Comments: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎంకే రాజ్యాంగాన్ని గౌరవించి ప్రత్యేక తమిళనాడు అంశాన్ని పక్కనపెట్టిందని ఏ రాజా పేర్కొన్నారు. ప్రత్యేక తమిళనాడు కోసం మేము పోరాడే పరిస్థితిని మాకు కల్పించవద్దని సూచించారు. అన్ని రాష్ట్రాలతో కలిసి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవు, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలకు స్వంతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదని డీఎంకే ఎంపీ రాజా పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తుందంటూ మండిపడ్డారు. స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం పలు పరిణామాలకు సంబంధించి తమిళనాడు స్వయంప్రతిపత్తి కోసం పోరాడుతూనే ఉందని రాజా అభిప్రాయపడ్డారు.

‘‘భారతీయ రాష్ట్రాలన్నింటిని సమానంగా పరిగణిస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకం చేయడానికి హిందీ భాష కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. తాను తమిళనాడులో అధికార పార్టీలో భాగమైనందుకు, లేదా ముఖ్యమంత్రి వేదికపై ఉన్నారన్న అహంకారంతో మాట్లాడం లేదు.. అలా అస్సలు అనుకోకండి. ప్రత్యేక దేశ డిమాండ్‌ను విరమించుకొని.. భారతదేశం పట్ల ఐక్యత, ప్రేమతో సమాఖ్య వ్యవస్థను స్వీకరించి DMK అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నాను” అని రాజా పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులకోసం తాము పోరాడి అలిసిపోయామని. పెరియార్ సిద్ధాంతాలైన ప్రత్యేక తమిళనాడు అంశాన్ని మళ్లీ తాము తెరపైకి తెచ్చే పరిస్థితులను కల్పించద్దంటూ రాజా అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులను కాలరాయొద్దు.. పోరాడే పరిస్థితులను కల్పించవద్దంటూ రాజా కోరారు. ప్రస్తుత త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నాదురై మార్గంలో వెళుతున్నారని పేర్కొన్నారు. పెరియార్ మార్గం కంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి స్వయం ప్రతిపత్తి కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. కాగా.. డీఎంకే ఎంపీ రాజా చేసిన ఈ కామెంట్స్ దేశ, త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌లో సంచలనంగా మారాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి