India Weather Report: దేశంలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండ భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు..!

|

May 17, 2022 | 7:32 AM

India Weather Report: ఓవైపు మంటలు.. మరోవైపు వరదలు.. ఇదీ దేశంలోని ప్రస్తుత పరిస్థితి. ఒకే దేశంలో టూ సిట్చుయేషన్స్‌.. ఉత్తరాదిలో సూరీడు సెగలు కక్కుతుంటే..

India Weather Report: దేశంలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండ భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు..!
Heat Waves
Follow us on

India Weather Report: ఓవైపు మంటలు.. మరోవైపు వరదలు.. ఇదీ దేశంలోని ప్రస్తుత పరిస్థితి. ఒకే దేశంలో టూ సిట్చుయేషన్స్‌.. ఉత్తరాదిలో సూరీడు సెగలు కక్కుతుంటే.. దక్షిణాదిలో వాన దంచికొడుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. రోజువారిగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రికార్డు బద్దలు కొడుతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఢిల్లీలో 49 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ రికార్డవుతోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకురావద్దంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. ఎప్పుడో 1944 మే 29న సఫ్దర్‌జంగ్‌ వెదర్‌ స్టేషన్‌లో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దాన్ని మించిపోయింది ఎండల తీవ్రత. ఎక్స్‌ట్రీమ్‌ టెంపరేచర్స్‌తో ఢిల్లీలో, చుట్టుపక్కల ప్రాంతాలు హీట్‌ ఐలాండ్స్‌గా మారాయని అంటోంది నాసా. దీనికి సంబంధించి నాసాలోని జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ ఓ ఫొటోను రిలీజ్‌ చేసింది. ఈ ప్రాంతాల్లో టెంపరేచర్స్‌ 40 డిగ్రీలకు తక్కువ ఉండటం లేదని పేర్కొంది.

గుజరాత్‌లో ఎండకు తాళలేక పిట్టలు రాలిపోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో పక్షులు డీహైడ్రేషన్‌తో మృత్యువాత పడుతున్నాయి. గుజరాత్‌ సహా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా ఉంటున్నాయి. దీంతో పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా మారాయి ఈ ఏడాది హీట్‌ కండీషన్స్‌. కొన్ని రోజులుగా వేలాది పక్షులకు ట్రీట్‌మెంట్‌ చేశామని చెబుతున్నారు వెటర్నరీ డాక్టర్లు.

ఇక.. దక్షిణాదిలో పరిస్థితి డిఫరెంట్‌గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. కుండపోత వానలతో పాటు పిడుగులు జనాన్ని భయపెడుతున్నాయి. ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించాయని చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రుతు పవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాయని పేర్కొంది. ఇవి చురుగ్గా కదులుతున్నాయని, అండమాన్‌ అంతటా విస్తరిస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది నైరుతి నాలుగు రోజులు ముందే వస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు, ఈశాన్య రాష్ట్రమైన అసోంను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి. కొండ చరియలు, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బతినడంతో రవాణా నిలిచిపోయింది. ఇలా.. ఒకచోట ఎండలు.. మరోచోట వానలతో దేశంలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి.