ఛత్తీస్‌గఢ్‌లో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సూరజ్‌పూర్ జిల్లా ప్రతాపూర్ బ్లాక్ జగన్నాథ్‌పూర్ దుబ్కాపరాలో భూ వివాదంతో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. ఓ కుటుంబంపై 20 నుంచి 30 మంది గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఇందులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచాడు.
మాదే తోప్పో అనే వ్యక్తి కుటుంబానికి దుబ్బాకపరా గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. విభజన విషయంలో సోదరుడితో గొడవలు జరుగుతున్నాయి. కాగా, శుక్రవారం(జనవరి 10) పంటలు వేసే విషయంలో ఇద్దరు అన్నదమ్ములు, వారి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో మాదే తోప్పో సోదరుడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడని సమాచారం. ఈ ఘటనలో మాదే తోప్పో భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మాదే టోప్పో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఖడ్గవాన్ పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రతాపూర్ పోలీస్ స్టేషన్‌లోని ఖడ్గవా అవుట్‌పోస్టు పరిధిలోని కెర్టా పంచాయతీ దూబ్కాపరాలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం రక్తపాతం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. మృతుల్లో బసంతి తోప్పో (53), నరేష్ తోప్పో (31), మాదే తోప్పో (60) ఉన్నారు. మృతుల కుటుంబం రెండు నెలల క్రితం జిల్లా సెషన్స్ కోర్టు, ఎస్‌డిఎం కోర్టులో ఏడున్నర ఎకరాల భూమి కేసును గెలుపొందినట్లు సమాచారం. శుక్రవారం మృతుడి కుటుంబం పొలం దున్నేందుకు వచ్చింది. ఇంతలో నిందితులు దాదాపు 30-40 మంది అక్కడికి చేరుకుని మాదే తోప్పో కుటుంబసభ్యులను దారుణంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో నిందితులు జగర్‌నాథ్‌పూర్, కెర్తా గ్రామాల వాసులుగా స్థానికులు చెబుతున్నారు.
ఈ హత్యాకాండ తర్వాత పోలీసులపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి పట్టపగలు ఒక పొలంలో ముగ్గురిని హత్య చేశారు. గంటల తర్వాత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు సరైన సమయంలో ఘటనా స్థలానికి చేరుకుని ఉంటే, మృతులను కాపాడే అవకాశం ఉండేది. గుంపుగా వచ్చిన వారు గూండాలా, కిరాతకులా, హంతకులా ప్రవర్తించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..