మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈసారి ఉత్కంఠభరితమైన పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఇక్కడ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. ఇక మరి కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు. ప్రచార పర్వం ముగియడంతో సభలు, సమావేశాలు, ఊరేగింపులు, లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేయడంపై పూర్తి నిషేధం విధించింది ఎన్నికలం సంఘం.
తొలి విడతలో మధ్యప్రదేశ్ పోలింగ్
మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 5.6 కోట్లు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 2.88 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.72 కోట్లు. రాష్ట్రంలో మొత్తం 22.36 లక్షల మంది యువత తొలిసారి ఓటు వేయనుండడం ఈసారి అత్యంత విశేషమే.
2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి?
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 109 సీట్లు గెలుచుకుంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ 2 ఓట్ల తేడాతో మెజారిటీ తప్పింది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో కమల్‌నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తదనంతరం మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. కేవలం ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది.
ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ, కాంగ్రెస్
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలను అధికారానికి సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు. మధ్యప్రదేశ్‌లో 29 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీకి దగ్గరగా ఉన్నప్పటికీ, కొంతకాలం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఆధిక్యం సాధించింది. మొత్తానికి మధ్యప్రదేశ్‌లో రెండు పార్టీలు తమ సీట్లను పెంచుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్
ఛత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగ్గా, మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న రెండో దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కోటి 63 లక్షల 14 వేల 4 వందల 89 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అనురాగ్ సింగ్ ఠాకూర్, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు చోట్ల ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. కాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బలోదాబజార్, బెమెతరలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా సమావేశాలు నిర్వహించారు.
మరోవైపు రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ మృతి చెందడంతో శ్రీ కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని 200 స్థానాలకు బదులు 199 స్థానాలకు నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బార్మర్ జిల్లా బైతులో జరిగిన బహిరంగ సభలో బీజేపీ సీనియర్ నేత, ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి, పేపర్ లీకేజీలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రధాని మోదీ. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ వెళ్లిపోతోందని, బీజేపీ వస్తోందని మోదీ అన్నారు. మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అజ్మీర్, కోట్‌పుట్లీ, ఉదయపూర్వతిలో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించే పనిలో పడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…