అయోధ్య అనగానే అందరి దృష్టి అక్కడ నిర్మాణం పూర్తిచేసుకుంటున్న రామమందిరం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనపైనే ఉంది. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే విశిష్ట అతిథులు, వారికి ఇవ్వబోయే బహుమతులు, ఆలయానికి వస్తున్న కానుకలు, ఇతర విశేషాల గురించే అందరూ ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. ప్రారంభోత్సవం తర్వాత వీలునుబట్టి రామజన్మభూమికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఆలయానికి వచ్చే భక్తులకు ఆతిథ్యమిచ్చే అయోధ్య నగరం ఎలా ఉంది? మిలియన్ల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆ నగరం ఆశ్రయం ఇవ్వగలదా?
ఇలాంటి సందేహాలు కూడా చాలామందిలో ఉన్నాయి. అవును.. అయోధ్యలో ఆ శ్రీరామచంద్రుడికి ఆలయం మాత్రమే కాదు, యావత్ అయోధ్యానగరమే పునర్నిర్మాణం జరుపుకుంటోంది. సర్వాంగ సుందరంగా తయారవుతోంది. లక్షల మందికి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. రైలు, రోడ్డు, వాయు మార్గాల్లో చేరుకోడానికి అవకాశమున్న అయోధ్యలో ఆ మేరకు రవాణా మౌలిక వసతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తున్నాయి. అక్కడున్న ఓ ఎయిర్‌స్ట్రిప్‌ను అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసి ప్రారంభించిన ప్రభుత్వం, రైల్వే స్టేషన్‌ను సైతం విమానాశ్రయానికి తీసిపోనివిధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ ఒకెత్తు.. నగరంలో ప్రతి ఇంట్లో.. ప్రతి అడుగులో నిర్మాణ పనులు జరగడం మరో ఎత్తు.
లక్నో – గోరఖ్‌పూర్ నగరాలను కలిపే జాతీయ రహదారిలో ఉన్న అయోధ్యాపురికి హైవే నుంచి వాహనం దిగగానే స్వాగతం పలికే భారీ స్వాగత తోరణం సహా సువిశాల కారిడార్ తయారవుతోంది. స్వాగత తోరణం నుంచి ఎత్తైన స్తంభాలు, ప్రధాన రహదారికి ఇరువైపులా పాదచారులు నడిచేందుకు విశాలమైన ఫుట్ పాత్, దానికి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా రామయణ ఇతహాసాన్ని తెలియపరిచే త్రీడీ ఆర్ట్ వర్క్ కనిపిస్తాయి. అక్కణ్ణుంచి కాస్త ముందుకు వెళ్లగానే ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరిట ఏర్పాటు చేసిన మూడు రోడ్ల కూడలి లతా మంగేష్కర్ చౌక్ కనిపిస్తుంది. ఈ చౌక్ నుంచి నేరుగా ముందుకెళ్తే సరయూ నదీ తీరం, అక్కడ అభివృద్ధి చేసిన అనేక ఘాట్లు కనిపిస్తాయి.
చౌక్ నుంచి ఎడమవైపునకు తిరిగితే అయోధ్య-ఫైజాబాద్ ప్రధాన రహదారిలోకి ప్రవేశిస్తాం. ఒకప్పుడు ఈ మార్గం చాలా ఇరుకుగా ఉండేది. కానీ ప్రభుత్వం అనేక భవనాలను కొంత మేర తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టింది. ఈ మార్గం నుంచి ముందుకెళ్తే రామజన్మభూమిలో నిర్మిస్తున్న ఆలయ ప్రవేశ మార్గం కనిపిస్తుంది. ఒక కారిడార్ మాదిరిగా ఈ రహదారి దగ్గర ప్రారంభమై సరయూ నది వరకు కొనసాగేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధంగా వివిధ అవసరాల కోసం అనేక భవంతులు, వసతి సదుపాయాలు, క్యూ కాంప్లెక్సులు నిర్మితమవుతున్నాయి.
అయోధ్యను ఇదివరకు సందర్శించిన ఎవరికైనా గజిబిజిగా ఉన్న విద్యుత్ తీగలతో దేశంలోని ఇతర సాధారణ పట్టణాల మాదిరిగానే ఉండేది. కానీ ఇప్పుడు అయోధ్యలో విద్యుత్తు వైర్లు ఎక్కడా గాలిలో కనిపించకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిగా అండర్ గ్రౌండ్ నుంచి విద్యుత్ సరఫరా చేసేలా పనులు జరుగుతున్నాయి. అలాగే వీధి దీపాలన్నీ కళాత్మక ఆకృతులతో ఎల్‌ఈడీ విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి. అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న వీధి దీపాలు గిన్నిస్ రికార్డుకు ఎక్కనున్నాయి. సరయూ నదీ తీరంలో గుప్తార్ ఘాట్ నుంచి నిర్మాలీ కుండ్ వరకు 10.2 కి.మీ మేర ఏర్పాటు చేయనున్న 470 సోలార్ విద్యుత్ దీపాలతో ఈ రికార్డు సాధించనున్నారు.
సౌదీ అరేబియాలోని మల్హం నగరంలో 9.7 కి.మీ పొడవున ఏర్పాటు చేసిన 468 సోలార్ స్ట్రీట్ లైటింగ్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఇప్పుడు అయోధ్యలో ప్రతిపాదిత ప్రాజెక్టు పూర్తయితే.. ఆ రికార్డును అధిగమించి వరల్డ్ రికార్డు సృష్టిస్తుంది. ఈ పనుల్లో 75 శాతం మేర పూర్తవగా, మిగతా పనులను జనవరి 22 లోగా పూర్తిచేసేందుకు నగర పాలక యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఇంత పొడవున పర్యావరణ అనుకూల ఇంధన వనరులతో వెలిగే విద్యుద్దీప కాంతులతో సరయూ నదీ తీరం ముస్తాబవుతుంది.
అయోధ్య నగర సుందరీకరణ పనుల్లో భాగంగా నగర పాలక యంత్రాంగం యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తోంది. ఆ ప్రకారం నగరంలో భవంతులను 4 విభాగాలు వర్గీకరించింది. వాణిజ్య, వ్యాపార భవనాలు ఒక కేటగిరీలో, నివాస భవనాలు ఒక కేటగిరీలో వర్గీకరించారు. అలాగే ఆలయాలు, వివిధ మతాలకు చెందన మందిరాలు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాలను ఒక కేటగిరీలోకి తీసుకురాగా.. చారిత్రక కట్టడాలు, భవంతులను 4వ కేటగిరీలో చేర్చారు. ఈ నాలుగు కేటగిరీలకు వేర్వేరు కలర్ కోడింగ్ చేసి, ఆ మేరకు యూనిఫాం డిజైన్, స్టైల్, డిజైన్ అమలు చేస్తున్నారు. సాధారణంగా ఈ తరహా నిర్మాణ నిబంధనలు యురోపియన్ దేశాల్లో కనిపిస్తాయి. భవనాల ఆర్కిటెక్చర్, డిజైన్ విషయంలో ఆ దేశాలు చాలా తమ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడే నిర్మాణ శైలితో నిబంధనల మేరకు మాత్రమే నిర్మించేలా చర్యలు తీసుకుంటాయి.
అందుకే అక్కడి నగరాల్లో కొన్ని వీధులను చూస్తుంటే ముచ్చటగొలిపే రంగులతో, ఆకృతులతో ఉన్న భవనాలు ఆకట్టుకుంటాయి. ఈ తరహాలోనే అయోధ్య నగరంలో కూడా భవంతులు, దుకాణ సముదాయాలన్నీ ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్లు, రంగులతోనే రూపుదిద్దుకుంటున్నాయి. అయోధ్య – ఫైజాబాద్ రహదారిని విస్తరించిన నేపథ్యంలో అనేక భవంతులను తొలగించాల్సి వచ్చింది. రోడ్డుకు ఆనుకుని కనిపించే ప్రతి భవంతి, దుకాణ సముదాయం ఏకరూపత కలిగి ఉండేలా ప్రభుత్వం యూనిఫాం బిల్డింగ్ కోడ్ అమలు చేస్తోంది. చాలా వరకు నిర్మాణ దశలోనే ఉండడం వల్ల నగర వీధులు పూర్తి ఆకృతి సంతరించుకోలేదు. కొన్ని నెలల్లో ఈ పనులన్నీ పూర్తయ్యాక అయోధ్యను చూసినవాళ్లు ఆశ్చర్యపోక తప్పదు.
రోడ్డు విస్తరణ కారణంగా తొలగించిన భవనాల స్థానంలోనూ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఇక్కడున్న హోటళ్లు, వసతి గృహాల నిర్వాహకులు తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో అదనపు అంతస్థులు లేదా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చాయి. అయోధ్య నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. సరికొత్త వెంచర్లు వెలుస్తున్నాయి. ప్రైవేట్ హోటళ్లు, రిసార్టులు పెరుగుతున్నాయి. నగరంలో ఆలయానికి సమీపంలో నివాస భవాలున్న ప్రతి ఒక్కరు తమ ఇళ్లను హోటళ్లుగా మార్చేస్తున్నారు. లేదంటే ‘హోం స్టే’లు మార్చి తమ ఆదాయమార్గాలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఇంట్లోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తంగా అయోధ్యం నగరం మొత్తం అండర్ కన్‌స్ట్రక్షన్ – వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..