Wireless కాలంలో కూడా Gen Z ఎందుకు వైర్ ఇయర్‌ఫోన్స్‌నే కోరుకుంటోంది? అసలు కారణాలు ఇవే

Gen Z wired earphones trend: టెక్నాలజీ మారిన తర్వాత వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ వైపు అందరూ వెళ్లారు. కానీ ఇప్పుడు మళ్లీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇది కేవలం నోస్టాల్జియా కాదు, సౌకర్యం, ఆరోగ్య కారణాల వల్ల కూడా. కొందరు వైర్‌లెస్ వాడకంతో తలనొప్పి, చెవి అలసట వస్తుందని భావించి తిరిగి వైర్డ్ వైపు వస్తున్నారు.

Wireless కాలంలో కూడా Gen Z ఎందుకు వైర్ ఇయర్‌ఫోన్స్‌నే కోరుకుంటోంది? అసలు కారణాలు ఇవే
Ear Phones

Edited By:

Updated on: May 14, 2026 | 12:38 PM

టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనం కొత్త వాటికి అలవాటు పడతాం. ఒకప్పుడు వైర్లతో చుట్టుముట్టిన ఇయర్‌ఫోన్స్ చూసి విసుగు చెంది.. వైర్‌లెస్ బడ్స్ వైపు అందరూ పరుగులు తీశారు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. గత ఐదేళ్లుగా తగ్గుతూ వచ్చిన వైర్డ్ ఇయర్‌ఫోన్స్ అమ్మకాలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్లో మళ్ళీ పాత రోజులు కనిపిస్తున్నాయి. కేవలం నోస్టాల్జియా మాత్రమే దీనికి కారణం అంటే పొరపాటే. దీని వెనుక వినియోగదారుల ఆరోగ్య సమస్యలు, సౌకర్యం దాగి ఉన్నాయి.

తలనొప్పి..

వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ వాడే వారిలో ప్రధానంగా తలనొప్పి సమస్య కనిపిస్తోంది. గంటల తరబడి చెవుల్లో పెట్టుకోవడం వల్ల చెవి అలసట అంటే ఇయర్ ఫెటీగ్ బారిన పడుతున్నారు. బ్లూటూత్ సిగ్నల్స్ వల్ల వచ్చే ఒక రకమైన బజ్జింగ్ శబ్దం మెదడుపై ప్రభావం చూపుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే చాలామంది వినియోగదారులు మళ్ళీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్యం విషయంలో రిస్క్ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.

ఛార్జింగ్..

మరో ప్రధాన సమస్య ఛార్జింగ్. వైర్‌లెస్ బడ్స్ వాడేవారికి ఎప్పుడూ ఛార్జింగ్ ఆందోళన ఉంటుంది. ముఖ్యమైన కాల్ మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటన్న భయం ఉంటుంది. అదే వైర్డ్ ఇయర్‌ఫోన్స్ అయితే ఆ గొడవే ఉండదు. ఫోన్‌కు ప్లగ్ చేస్తే చాలు.. గంటల తరబడి వాడుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టే అవసరం లేకపోవడం, బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచించాల్సిన పని లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్.

ఫెయిరింగ్..

పెయిరింగ్ సమస్యలు కూడా వైర్‌లెస్ వాడేవారిని ఇబ్బంది పెడుతున్నాయి. కొన్నిసార్లు ఒక చెవికి వినిపించి, మరో చెవికి వినిపించకపోవడం లేదా బ్లూటూత్ కనెక్ట్ కావడానికి టైమ్ పట్టడం వంటివి విసుగు తెప్పిస్తాయి. వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో ఇటువంటి డ్రామా ఉండదు. సాకెట్‌లో పెట్టగానే ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతాయి. ఈ సింప్లిసిటీ వల్లే మళ్ళీ పాత మోడల్స్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి.

ధర..

ధర పరంగా చూసినా వైర్డ్ ఇయర్‌ఫోన్స్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. వెయ్యి రూపాయల లోపు లభించే ఒక మంచి వైర్డ్ ఇయర్‌ఫోన్ ఇచ్చే సౌండ్ క్వాలిటీ.. రెండు మూడు వేల రూపాయల వైర్‌లెస్ బడ్స్ కూడా ఇవ్వలేకపోతున్నాయి. మ్యూజిక్ లవర్స్ క్వాలిటీ కోరుకుంటారు కాబట్టి వారు వైర్డ్ వైపు వెళ్తున్నారు. తక్కువ ధరలో ప్రీమియం ఆడియో అనుభూతిని ఇవి అందిస్తున్నాయి.

ఇప్పుడిదే కొత్త ఫ్యాషన్..

యువతలో ఇప్పుడు రెట్రో స్టైల్ పట్ల మక్కువ పెరిగింది. వైర్డ్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం ఒక కొత్త ఫ్యాషన్‌గా మారుతోంది. సెలబ్రిటీలు కూడా వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌తో కనిపిస్తుండటంతో క్రేజ్ మరింత పెరిగింది. ఇది కేవలం టెంపరరీ ట్రెండ్ మాత్రమే కాదు.. ప్రాక్టికల్ అవసరాల వల్ల వచ్చిన మార్పు అని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి ఇదొక మార్గంగా కనిపిస్తోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా.. కంఫర్ట్, హెల్త్ ముఖ్యం అని వినియోగదారులు భావిస్తున్నారు. మరి మీరు కూడా వైర్‌లెస్ నుంచి మళ్ళీ వైర్డ్ వై మారుతున్నారా? లేక ఇది కేవలం కొద్ది రోజుల క్రేజ్ మాత్రమేనా..?!

Follow Us