ఒక నివేదిక ప్రకారం.. మీరు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ గంటకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో నడవండి. అమెరికా, జపాన్ బ్రిటన్ వంటి దేశాల నుండి 508,121 మంది పెద్దలు పాల్గొన్న ఒక పరిశోధనలో కొత్త వివరాలు వెల్లడయ్యాయి. వాకింగ్ వేగం ఎంత ఎక్కువగా ఉంటే.. దానితో సంబంధం ఉన్న ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. గంటకు 3-5 కిలోమీటర్ల సగటు నడక వేగం నెమ్మదిగా నడవడం కంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
టైప్ 2 మధుమేహం ప్రపంచ వ్యాప్తి 2045 నాటికి 537 మిలియన్ల నుండి 783 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇరాన్‌లోని సెమ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకుల ప్రకారం.. వేగంగా నడవటం సాధారణ, తక్కువ ఖర్చుతో కూడిన శారీరక శ్రమను అవలంబించడం సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. పలు రకాల వ్యాధులను ఎదుర్కోవటానికి అందుబాటులో ఉన్న సాధనంగా పని చేస్తుందన్నారు.. ఈ విధానం మధుమేహం నివారణలో సహాయపడటమే కాకుండా అనేక సామాజిక, మానసిక మరియు శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని వారు పేర్కొన్నారు.
అంతేకాదు.. మాములు నడక కంటే కూడా వేగంగా నడవటం వల్ల ఇతర అనేక పెద్ద పెద్ద వ్యాధులను కూడా దరి చేరకుండా చేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల ముప్పు నుంచి రక్షించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వేగంగా నడవటం వల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెరుగుతుంది. రోజూ 10 వేల అడుగులు నడవటం వల్ల గుండె సంబంధిత, అకాల మరణాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్ సైతం నియంత్రణలో ఉంటాయి. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. వేగంగా నడవటం వల్ల మెదడు పనితీరుపై అనుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది మూడ్ స్వింగ్స్, జ్ఞాపకశక్తి, నిద్రకు మేలు చేస్తుంది.
స్పీడ్ వాకింగ్ కండరాల బలాన్ని పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. సాధారణంగా గుండె, రక్త నాళాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది. వేగంగా నడిచే అలవాటు ఉన్నవారిలో బరువు కంట్రోల్‌లో ఉంటుంది. వేగంగా నడిచినప్పడు గుండెకు వేగంగా రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యంగా ఉంటామని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..