
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా, సానుకూల శక్తి ప్రవహిస్తుందని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో రావి, మర్రి చెట్లకు అత్యంత ప్రాధాన్యత ఉంది. త్రిమూర్తులు ఈ చెట్లలో నివసిస్తారని జనాలు నమ్ముతారు. అయితే, ఈ పవిత్రమైన చెట్లను దేవాలయ ప్రాంగణంలో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ పెంచుకోవాలి. ఇంటి ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొక్కలను పెంచకూడదని అంటారు. ఇవి ఇంట్లో ఉంటే తీవ్రమైన వాస్తు దోషాలు ఏర్పడతాయని.. అంతేకాకుండా, వీటి వేర్లు భూమిలోకి ఎక్కువ దూరం విస్తరించి, ఇంటి పునాదులను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, మర్రి చెట్టు, రావి చెట్టును ఎప్పుడూ ఇంటి ఆవరణలో పెంచవద్దని చెబుతారు.
ఇంటి ఆవరణలో పెంచకూడని కొన్ని మొక్కలు
ముళ్ళ మొక్కలు: వాస్తుశాస్త్రం ప్రకారం, ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచడం అశుభకరం. బ్రహ్మజముడు, నాగజముడు, రేగి చెట్టు వంటి ముళ్ళ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఇలాంటి మొక్కలు ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాప్తి చేసి, అనేక అనారోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తాయి. అయితే, ముళ్ళ మొక్క అయినప్పటికీ, గులాబీ మొక్కను మాత్రం ఇంట్లో పెంచుకోవచ్చు. గులాబీ మొక్కకు వాస్తు శాస్త్రంలో మినహాయింపు ఉంది.
పాలు కారే మొక్కలు : ఏదైనా మొక్క యొక్క ఆకును లేదా కాండాన్ని తెంపినప్పుడు తెల్లని పాలు కారే మొక్కలను ఇంట్లో ఎప్పుడూ పెంచుకోకూడదు. ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే ధన నష్టం, ఆరోగ్య నష్టం జరుగుతాయి. చాలా పాలు కారే మొక్కలు విషపూరితంగా ఉంటాయి కాబట్టి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే, శ్వేతార్క గణపతిని పూజించే తెల్ల జిల్లేడు చెట్టును మాత్రం ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి మినహాయింపు ఉంది.
చింత చెట్టు: చింత చెట్టుకు ప్రతికూల శక్తిని ఆకర్షించే శక్తి ఉందని వాస్తు నిపుణులు చెబుతారు. చింత చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పెద్దలు నమ్ముతారు. చింత చెట్టు ఇంట్లో గనుక ఉన్నట్లయితే, కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వం, కలహాలు ఏర్పడతాయి. అందువల్ల, ఇంటి ఆవరణలో చింత చెట్టు లేకుండా చూసుకోవాలి.
పత్తి చెట్టు: దీపారాధన చేయడానికి మనం ప్రతిరోజు పత్తిని ఉపయోగిస్తాం. పత్తి చెట్టు చూడటానికి అందంగా ఉన్నప్పటికీ, ఇంటి ఆవరణలో దీనిని పెంచడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పత్తి చెట్టును ఇంట్లో పెంచుకోకూడదు.
బోన్సాయి చెట్లు : ఆధునిక కాలంలో చాలామంది అందం కోసం బోన్సాయి చెట్లను ఇంట్లో పెంచుకుంటున్నారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, బోన్సాయి చెట్లను ఇంట్లో పెంచినట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని, జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదని చెప్పబడింది. కుంచించుకుపోయిన రూపంలో ఉండే ఈ చెట్లు అభివృద్ధిని సూచించవు.
చివరగా, ఇంటి ఆవరణలో ఎండిపోయిన చెట్లు, వాడిపోయిన మొక్కలు లేదా ముళ్ళ మొక్కలు ఏవీ లేకుండా చూసుకోవాలి. ఇంటి ముందు ఎత్తైన చెట్లు ఉండకుండా జాగ్రత్తపడాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా ఎలాంటి వాస్తు దోషాలు ఏర్పడకుండా, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.